ముద్దు వివాదంలో మేక్రాన్…?
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒలింపిక్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్స్ ఆరంభంలో పలు వివాదాలకు దారితీసినా.. నెమ్మదిగా గాడిలో పడ్డాయి. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాత్రం… ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఘటనతో ఇబ్బందుల్లో పడ్డారు.ఫ్రాన్స్ క్రీడా మంత్రి ఎమిలీ కాస్టెరా.. అధ్యక్షుడిని కౌగలించుకుని ఆయన చెంపపై గట్టిగా ముద్దుపెట్టారు.ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో క్లిక్ మనిపించింది. ఫ్రెంచ్ కిస్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినప్పటికీ.. ఇలాంటి అంతర్జాతీయ వేదికగా ఈ దృశ్యం కాస్త వివాదంగా మారింది.
ఎమిలీ కాస్టెరా… అధ్యక్షుడు మేక్రాన్ ను ముద్దుపెట్టుకోవడం చూస్తుంటే.. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందన్న వాదనలు బయలుదేరాయి. మరోవైపు..ఆ సమయంలో పక్కనే ఉన్న ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ కాస్త ఇబ్బందిపడుతూ పక్కకు చూస్తున్నట్లుగా కన్పించింది. ‘ఈ ముద్దు చాలా వింతగా ఉంది. బహుశా మంత్రి ఎమిలీ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారేమో’ మాడమ్ ఫిగారో రాసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్గా మారింది. ఇందులో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు కన్పించడం వివాదానికి దారితీసింది. దీనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ఓ గొప్ప కార్యక్రమంలో ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా.. క్రీడల మంత్రిగా వ్యవహరిస్తున్న ఎమిలీ ఇటీవల ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు సెన్ నదిలో స్విమ్మింగ్ చేశారు. నది చాలా పరిశుభ్రంగా ఉందని చాటి చెప్పేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అందులో నీటి నాణ్యతపై ఇంకా ఆందోళనలు తొలగిపోలేదు. నదిలో నిర్వహించాల్సిన కొన్ని పోటీలను వాయిదా వేశారు కూడా..






