కచ్చతీవు వివాదం ఏంటి..?
భారత్‌కు చెందిన కచ్చతీవు …1974లో శ్రీలంక వశమైంది. నాటి ప్రధాని ఇందిరగాంధీ.. దీన్ని శ్రీలంకకు ఓ ఒప్పందం ద్వారా అప్పగించారు. అయితే ఒప్పందం సమయం ఈ దీవికి వెళ్లేందుకు భారతీయులకు అవకాశముందని నిర్ణయం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లుగా కొలంబో దళాలు.. అక్కడికి వెెళ్లిన భారత మత్స్యకారులపై కాల్పులు జరుపుతుండడంతో … ఇది తీవ్ర రూపు దాలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కచ్చితంగా తమిళపార్టీలు.. ఈదీవి వివాదాన్ని తెరపైకి తెస్తున్నాయి. తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ఎక్కడుంది ఈ దీవి?
తమిళనాడు రామేశ్వరానికి సమీపంలో భారత్- శ్రీలంకను వేరుచేస్తున్న పాక్ జలసంధిలో ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. పాక్ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు. ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీనిపరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో వీరిపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా.. శ్రీలంక ఖాతరు చేయడం లేదు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.
మన భూభాగాలను ఇతరులకు ఇవ్వొచ్చా?
భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్-తూర్పు పాకిస్థాన్‌ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్ గవర్నర్ ఫిరోజ్‌ఖాన్ నూన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఇచ్చారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని పేర్కొంది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంతప్రాంతాన్ని తూర్పు పాక్‌కు ఇచ్చారు.
కచ్చతీవు అప్పగింత చెల్లుతుందా?
కచ్చతీవు స్వాతంత్ర్యం రాకపూర్వం రామ్నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం రామేశ్వరం సహా పలుదీవులపై రామ్నాడ్ జమీందారుల పాలన సాగేది. అనంతరం భారత్‌లో చేరడం, తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు జరిగింది. న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే కచ్చతీవు దీవిని వదిలేసింది: ప్రధాని మోదీ
కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తప్పుపట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్‌వేదికగా ఆరోపించారు. ‘‘ఆశ్చర్యకరమైన, దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసింది. ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైంది. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పనిచేసింది’’ అని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు. బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. మరోవైపు.. కచ్చదీవు విషయంలో ఓకార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తమిళ రాజకీయపక్షాలు కోరుతున్నాయి. అయితే వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి.. ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






