మాల్దీవులు యూటర్న్ వెనక ఆర్థిక కష్టాలు…?
మాల్దీవులు నూతన అధ్యక్షుడు ముయిజ్జు.. భారత వ్యతిరేక భావజాలమున్న వ్యక్తి. తొలి నుంచి భారత వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించారు. ఆ ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారు. అయితే భారత ప్రధాని మోడీపై మయిజ్జు మంత్రులు విషం కక్కడంతో వివాదం తీవ్రరూపు దాల్చింది. దీంతో మాల్దీవుల టూరిజాన్ని బాయ్ కాట్ చేశారు భారతీయులు. అంతేకాదు… బాయ్ కాట్ మాల్దీవుల పేరుతో ఆన్ లైన్ లో ట్రెండ్ చేశారు. ఇది మాల్దీవుల పర్యాటక రంగాన్ని గట్టిదెబ్బే కొట్టింది. పరిశ్రమలు, టూరిజం ఇండస్ట్రీ ఒత్తిడితో మళ్లీ భారతీయులను .. మాల్దీవులు రావాలంటూ ముయిజ్జు సర్కార్ కోరింది.
అయితే ముయిజ్జు సర్కార్ కు అసలు విషయం ఆలస్యంగా బోధపడింది. భారత్ కాదంటే తమను చైనా ఆదుకుంటుందని… తమ పర్యాటకాన్ని గట్టెక్కిస్తుందని తొలుత ముయిజ్జు సర్కార్ భావించింది. చైనాలో పర్యటించిన సమయంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు ముయిజ్జు. అయితే చైనామాత్రం సంబంధాల్లోనూ వాణిజ్యాన్ని చూస్తుంది కాబట్టి. అనుకున్నట్లుగా జరగలేదు. మరోవైపు.. రక్షణ రంగం బలోపేతమంటూ ఒప్పందాలు చేసుకున్నా.. అవి, చిన్నాచితక వాటితోనే బీజింగ్ సరిపెట్టింది.
మరోవైపు… భారత్ ఇచ్చిన రుణాలను తిరిగి వెనక్కివ్వాలని .. మోడీ సర్కార్ సూచించింది. దీంతో ఒక్కసారిగా ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి లేదు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరడంతో… భారత్ అంగీకరించింది. దీంతో భారత్ అవసరమేంటో.. మాల్దీవుల సర్కార్ కు తెలిసొచ్చినట్లైంది. మరోవైపు..మాల్దీవుల్లోని 28 దీవుల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలను భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు అందచేసింది. ఈ రోజు ఆ పనులు పూర్తైన సందర్భంగా ప్రెసిడెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాలు గణనీయమైన ఆర్థిక లాభాలను అందించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు మరియు దేశం యొక్క మొత్తం శ్రేయస్సును సమిష్టిగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టులు భారత్తో మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాళ్లను సూచిస్తాయని ఆయన హైలైట్ చేశారు.
తమ దేశానికి ఉదారమైన, నిరంతర సాయం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి, భారత ప్రభుత్వానికి, భారత దేశ ప్రజలకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు.మాల్దీవులు-భారత్ మధ్య శాశ్వతమైన సంబంధాలను గుర్తు చేశారు.. శతాబ్ధాల స్నేహం, పరస్పర గౌరవం, లోతైన సంబంధాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. మాల్దీవులు భారతీయ ప్రజలతో చారిత్రాత్మక సంబంధాలకు ఎంతో విలువనిస్తుందని చెప్పారు.
ఈ సంబంధాలను పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి అంకితభావంతో ఉన్నామని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల సహకారం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాల్దీవుల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంపై ఆ దేశ మంత్రులతో పాటు ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జూతో కూడా భేటీ అయ్యారు.






