Jogi Ramesh: జోగి రమేష్ పేరుతో ఏపీలో కలకలం రేపుతున్న ఐవీఆర్ఎస్ కాల్స్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఈ మధ్య ఐవీఆర్ఎస్ కాల్స్ (IVRS Calls) కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఒక సమాచారాన్ని వేలాది మందికి ఒకేసారి చేరవేయడానికి ఉపయోగించే ఈ సాంకేతికతను ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఈ వ్యవస్థను ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజల అభిప్రాయ సేకరణ, సర్వేలు లేదా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రాచుర్యం కోసం వాడేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిని రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి వినియోగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన కల్తీ మద్యం (Adulterated Liquor) వ్యవహారం దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నేతల పేర్లు బయటకు రావడంతో పరిస్థితి వేడెక్కింది. ముఖ్యంగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) నేత జోగి రమేష్ (Jogi Ramesh) పేరు ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వినిపించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ కాల్స్‌లో కల్తీ మద్యం కేసుకు ఆయనకే సంబంధం ఉందని ప్రజలకు పంపడం రాజకీయ రంగంలో పెద్ద కలకలం రేపింది.
అన్నమయ్య జిల్లా (Annamayya District) మునకలచెరువు (Mulakalacheruvu) ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించి మూసివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు టీడీపీ (TDP) నాయకులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ పార్టీ వెంటనే వారిని సస్పెండ్ చేసింది. అదే సమయంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు (Addepalli Janardhan Rao) ఒక వీడియో విడుదల చేసి, జోగి రమేష్ సూచనలతో ఈ చర్యలు చేశానని వెల్లడించడం మరింత వివాదాస్పదమైంది.ఈ వీడియోతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల యుద్ధం మొదలైంది. కొంతమంది జోగి రమేష్ అరెస్టు జరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పటివరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జోగి రమేష్‌ను టార్గెట్ చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. దీనితో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది.
ఇక టీడీపీ నేతలు టెక్నాలజీని ఉపయోగించి ప్రజల్లో జోగి రమేష్ పేరు కల్తీ మద్యం వ్యవహారంతో అనుసంధానం చేసేలా ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించడం కొత్త చర్చకు దారితీసింది. ఈ చర్యలు తనకు పరువు నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే జరిగాయని ఆయన ఆరోపించారు. జోగి రమేష్ ఈ కాల్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర డీజీపీ (DGP) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి సంబంధం లేకుండా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానని, దుష్ప్రచారం ద్వారా తన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా వేడెక్కింది. ఐవీఆర్ఎస్ టెక్నాలజీ రాజకీయ ప్రచారానికి మాత్రమే కాకుండా, ప్రత్యర్థులను కించపరచడానికి వాడటం ఎంతవరకు సముచితం అన్న చర్చ కొనసాగుతోంది. మరి ఈ విషయంలో కూటమి ఎలా రియాక్ట్ అవుతుంది.. అన్న విషయం ఆసక్తికరంగా మారింది.







