Tehran: ఇరాన్ మిస్సైల్స్ శక్తిపై ఇజ్రాయెల్ అంచనా తప్పిందా..? గగన తల రక్షణకు ఒక్కరాత్రికి 2,400కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది..!
పాలస్తీనా, లెబనాన్, ఇరాక్ లాంటి దేశం తమది కాదని ఇరాన్ సుప్రీంలీడర్ గతం నుంచి చెబుతూ వస్తున్నారు. మాపై దాడి చేస్తే తప్పనిసరిగా తీవ్రమైన ప్రతిదాడి తప్పదని సీరియస్ వార్నింగులు ఇచ్చారు.అయితే వీటిని ఇజ్రాయెల్ (Israel) పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ దాడుల, ప్రతిదాడుల తర్వాత ఇరాన్ బలగం ఎంత పటిష్టంగా ఉందో ఇజ్రాయెల్ కు తెలిసి వచ్చింది. తాము దుర్భేద్యమనుకున్న ఐరన్ డోమ్ కు చిల్లు పెట్టేసింది ఇరాన్. దీంతో ప్రత్యామ్నాయాల కోసం వందలకోట్లు ఖర్చు పెడుతోంది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ.. ప్రతిదాడులను అడ్డుకునేందుకు ఈ దేశం తీవ్రంగానే చెమటోడుస్తోంది. ఇప్పటికే ‘ఐరన్ డోమ్’కు చిల్లుపడటంతో ఇరాన్ (Iran) ప్రయోగించే క్షిపణులు కీలక ప్రాంతాల మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కారు భారీగా వెచ్చించాల్సి వస్తోంది.. దీని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఒక్క రాత్రికి ఏకంగా 285 మిలియన్ డాలర్ల మేర (భారత కరెన్సీలో దాదాపు రూ.2400కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రచురించింది.
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గతవారం ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇప్పటివరకు దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ‘యారో సిస్టమ్’ను వినియోగిస్తున్నాయి. దీంతో పాటు డేవిడ్స్ స్లింగ్, అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్స్, థాడ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించాయి.
అయితే, వీటి నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు తడిసి మోపడవుతున్నట్లు తెలుస్తోంది. క్షిపణి రక్షణ వ్యవస్థల ఆపరేషన్ల కోసం ఒక్క రాత్రికే 285 మిలియన్ డాలర్ల మేర ఖర్చవుతున్నట్లు ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ డెయిలీ ‘ది మార్కర్’ అంచనా వేసింది. ఒక్క ‘యారో సిస్టమ్’ ద్వారానే 3 మిలియన్ డాలర్ల చొప్పున విలువైన ఇంటర్సెప్టర్లను ప్రయోగించి క్షిపణులను అడ్డుకుంటున్నారు.
ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి దాదాపు ప్రతిరోజూ ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తూనే ఉంది. ఇదిలాగే మరిన్ని రోజులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికా నుంచి సరఫరా గానీ, సాయం గానీ అందకపోతే.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 10-12 రోజుల్లోనే క్షీణిస్తుందని సమాచారం.
ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్‌లోని పలు కీలక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. టెల్‌అవీవ్‌లోని ఐడీఎఫ్ ప్రధాన కార్యాలయం, హైఫా సమీపంలోని ప్రధాన చమురు శుద్ధి కేంద్రం, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించగా.. మరో 600 మంది గాయపడినట్లు నెతన్యాహు ప్రభుత్వం వెల్లడించింది.







