ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ దేశాలు….?
ఇజ్రాయెల్ -హమాస్ వార్ విస్తరిస్తోంది. మొన్నటివరకూ హమాస్, ఇజ్రాయెల్ మధ్యజరిగిన ఈ పోరు కాస్తా.. ఇప్పుడు ఇరాన్, లెబనాన్ కు విస్తరించిన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ పౌరులపై దాడిని తీవ్రంగా భావించిన ఇజ్రాయెల్.. హమాస్ నేతలను మట్టుపెట్టేవరకూ వెనక్కు తగ్గబోనని ప్రకటిస్తోంది. దీనికి గానూ ఎక్కడెక్కడో దాక్కున్న హమాస్ నేతలను సైతం.. సీక్రెట్ ఆపరేషన్లతో హతమారుస్తోంది. ఈ ఆపరేషన్లకు అమెరికా సాయం కూడా అందుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు ధృవీకరిస్తున్నాయి కూాడా.
అమెరికాకు గల్ఫ్ దేశాలతో వ్యాపార లావాదేవీలున్నాయి. ఆయా దేశాలతో ఇటీవలి కాలంలో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడీ యుద్ధం కారణంగా వారి మధ్య లావాదేవీలకు ఇబ్బంది రాకూడదు. అలా అని తమదేశంలో బలంగా ఉన్న యూదు లాబీని కాదనే పరిస్థితి లేదు. ఇప్పుడు వీటన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయాలన్నది అమెరికాకు కత్తిమీద సాములా మారింది. అందుకే ఓవైపు గల్ఫ్ దేశాలతో మితృత్వం చెదరకుండా.. మరోవైపు ఇజ్రాయెల్ ను వెనకేసుకొస్తోంది.
అయితే ఇరాన్ లో హమాస్ నేత హనియా హత్యతో.. యుద్ధరంగంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు హమాస్, హెజ్ బొల్లా, ఇరాన్, లెబనాన్ ఓవైపు.. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్, మరికొన్ని దేశాలు కనిపిస్తున్నాయి. ఈపరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ పరిరక్షణకు అన్నిరకాలుగా కట్టుబడి ఉన్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దానికి తగ్గట్లుగా యుద్ధనౌకలు, ఇతర ఫైటర్ జెట్లు తరలిస్తోంది కూడా. మరోవైపు… ఇజ్రాయెల్ దుందుడుకు వైఖరి.. మిత్రదేశాలకు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది.ఎందుకంటే.. నేరుగా అగ్రరాజ్యం దన్నున్న ఇజ్రాయెల్ ను ఈ దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి ఉండడంతో… అవి తప్పకుండా ఇతర మార్గాలను అన్వేషిస్తాయనడంలో సందేహం లేదు.
ఫలితంగా ఆయాదేశాలు ఉగ్రవాదానికి మరింత ఊతమిచ్చే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా సహా చాలా ఉగ్రవాద సంస్థలు మరింతబలోపేతమయ్యే ప్రమాదం ఉంది.. దీంతో అగ్రరాజ్యం అమెరికా సహా పలుదేశాల్లో ఉగ్రకార్యకలాపాలు పెరగడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా మిత్రదేశాల్లో కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. ఇవికూడా జతకూడితే వచ్చే అనర్థం ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితులుఏర్పడే అవకాశముందన్నది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది..






