Khamenei: ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదు.. ట్రంప్ కు ఖమేనీ కౌంటర్..
తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ దాడుల వేళ వీడియో సందేశం విడుదల చేసిన ఆయన.. ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను ఉద్దేశిస్తూ.. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు.
విస్తృత యుద్ధమే..!
ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఘర్షణల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ఆయన.. తమపై దాడులకు దీటుగా స్పందిస్తామన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఖమేనీ ఈ విధంగా స్పందించారు.
అంతకు ముందు ఇజ్రాయెల్ సైతం .. ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ లొంగిపోకపోతే.. టెహ్రాన్ నాశనమవుతుందని హెచ్చరించింది. అంతేకాదు.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు పట్టిన గతే.. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీకి పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఖమేనీని హతమారిస్తే, తప్ప ఇరాన్ లొంగే అవకాశం లేదని ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. చర్చల ప్రతిపాదన సరైంది కాదన్నారు నెతన్యాహు.







