Iran: అమెరికా, యూరోప్, ఇజ్రాయెల్ కలిసి వచ్చినా పోరాడేందుకు సిద్ధమంటున్న ఇరాన్..!
ఓవైపు భీకర రక్షణ వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్ (Israel) దాడులకు తెగబడుతోంది. మీ అంతు తేల్చేస్తామంటూ హెచ్చరికలు పంపుతోంది. మొస్సాద్ అయితే ఇరాన్ నాయకులను దొరికిన వాళ్లను దొరికినట్లు లేపేసే ప్రయత్నాల్లో ఉంది. ఇక ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తి, వార్ ప్లేన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఇజ్రాయెల్ తో వార్ అంటే గల్ఫ్ దేశాలు సహా అన్ని భయపడతాయి. మరి ఇరాన్ ఎందుకింత ధైర్యంగా ఉంది. అమెరికాను సైతం వార్న్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది. అసలు ఇరాన్ ధైర్యం వెనక ఉన్న కారణాలేంటి..?
ఇరాన్ (Iran) ను మనం క్షుణ్నంగా పరిశీలిస్తే.. నీటిలో మొసలి లాంటిదని అర్థం చేసుకోవచ్చు. బయటకు వస్తే కుక్క దగ్గర కూడా భంగపడే మొసలి తనదైన నీటిలో దిగితే.. ఎవరినైనా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇదే ఇరాన్ యుద్ధ తంత్రం. ఇప్పుడు ఇదే విషయం అమెరికా, ఇజ్రాయెల్ కు కూడా అర్థమవుతోంది. ఎప్పటివో కాలం చెల్లిన ఆయుధాలు ఉన్నాయి ఇరాన్ దగ్గర అనుకున్నాయి. ఈ దేశాలు. కానీ అది ప్రయోగిస్తున్న క్షిపణులు చూసి డంగై పోతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ లాంటి దేశం ఇప్పుడు తమ గగన తలాన్ని కాపాడుకునేందుకు వేల కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్ధితికి దిగజారింది.
‘బేషరతుగా లొంగిపోవాలి’, ‘అణ్వాయుధాలు వదిలేయాల్సిందే’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఒకవేళ వాషింగ్టన్ కూడా టెల్అవీవ్తో చేతులు కలిపి దాడిచేస్తే.. తగిన జవాబు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనంలో వెల్లడించింది.
టెహ్రాన్ యుద్ధ వ్యూహాలివి..!
అమెరికా దాదాపు మూడు డజన్ల రీఫ్యూయిలింగ్ ట్యాంకర్లను యూరప్ చేర్చింది. వీటిని గల్ఫ్‌లోని తమ బేస్‌లను రక్షించే ఫైటర్ జెట్లు, ఇరాన్‌పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకొనేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్ దాని వద్ద లేవు. అయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యూహం ఇరాన్ వద్ద ఉంది.
హర్మూజ్‌లో అమెరికా నౌకలకు ఉచ్చు..
ఈక్రమంలో ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు, ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హర్మూజ్‌లో అండర్ వాటర్ మైన్స్‌ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్‌లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీల్లేకుండా ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. అమెరికా జోక్యం చేసుకొంటే.. వాటి స్థావరాలపై దాడి చేస్తానని ఇప్పటికే ఇరాన్ తేల్చిచెప్పింది.
40,000 మంది అమెరికా సిబ్బంది చిక్కుల్లో..
మధ్యప్రాశ్చ్యంలోని ఇరాక్, యూఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్‌లో ఉన్న 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది ప్రమాదంలో పడతారు. ఇరాన్ దాడులు ఇరాక్‌లోని స్థావరాలతోనే మొదలుకావచ్చు. ఎందుకంటే అక్కడ టెహ్రాన్ మద్దతు ముఠాలు చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్షిపణుల పరిధిలోకి బహ్రెయన్, ఖతార్, యూఏఈ ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే.. చమురు ధరలు భగ్గుమనడంతోపాటు.. పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది.







