Tehran: అంతకు అంతా శిక్ష తప్పదు.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక…

తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇక అగ్రరాజ్యానికి శాశ్వతగాయం తప్పదంటూ ఘాటుగా హెచ్చరించారు ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి (Seyed Abbas Araghchi). అమెరికా తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (NPT) ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా.. తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతి యుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణుకేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇటువంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అగ్రరాజ్యంతో ఐక్యరాజ్యసమితి లోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్ సూచించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. యూఎన్ (UN) చార్టర్ ప్రకారం.. ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. టెల్‌అవీవ్‌పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందన్నారు అబ్బాస్..
ఇరాన్‌లోని ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Trump) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవంతంగా దాడులు చేశామని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా సంస్థ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. అమెరికా తమపై దాడులు చేసినందుక తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తామని పేర్కొంది.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అభినందించారు. అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో అగ్రరాజ్యం ఇరాన్‌లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదని.. చరిత్రను మార్చేస్తుందని పేర్కొన్నారు.