Hormuz Strait: హర్ముజ్ ను ఆపేదమ్ము ఇరాన్ కు ఉందా..? జల సంధి గురించి ఆసక్తికర విషయాలు..!

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం, అమెరికా(America) జోక్యం నేపధ్యంలో ఇరాన్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఆ దేశం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా తమ దేశం మీద దాడులు చేసిన అనంతరం.. హార్ముజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక ప్రాంతంగా భావించే ఈ జల సంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలమార్గంగా చెప్తారు.
ప్రపంచ ముడి చమురులో దాదాపు 20% ఈ జలసంధి నుంచి చమురు ఉత్పత్తి దేశాలు రవాణా చేస్తున్నాయి. ఈ మార్గాన్ని మూసివేసినా ఇక్కడ ఏదైనా అంతరాయాలు ఏర్పడినా.. ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తులపై ఆధారపడిన భారత్(India) వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ సముద్ర మార్గం లేదు. సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాలు జలసంధిని దాటడానికి పైప్ లైన్ లు నిర్మించుకున్నాయి. కానీ వాటి మొత్తం సామర్థ్యం రోజుకు 6.8 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే.
ప్రతిరోజూ హార్ముజ్ గుండా ప్రయాణించే నౌకలు 20 మిలియన్ బ్యారెళ్లను రవాణా చేస్తాయి. ఇది చమురు ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. ఇరాన్ ముందుకు వెళ్లి హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, ఏడాదిలో జలసంధి ద్వారా చమురు రవాణా ఒక నెల పాటు సగానికి పడిపోతే.. ఆ తర్వాత మరో 11 నెలలు 10% తగ్గితే, బ్రెంట్ బ్యారెల్‌కు దాదాపు 110 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇరాన్ చమురు సరఫరా రోజుకు 1.75 మిలియన్ బ్యారెళ్లు తగ్గితే, బ్రెంట్ బ్యారెల్‌కు గరిష్టంగా 90 డాలర్లకు చేరుకుంటుంది. తన ముడి చమురు అవసరాలలో 80% కంటే ఎక్కువ దిగుమతి చేసుకునే దేశమైన భారత్ వంటి దేశాలకు ఇది ఖచ్చితంగా ఇబ్బందే. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ ఆమోదం ఆందోళన కలిగించినప్పటికీ, హార్ముజ్ జలసంధిని మూసివేయడం అసంభవమని నిపుణులు భావిస్తున్నారు. చారిత్రాత్మకంగా, గత ఘర్షణల సమయంలో కూడా ఇరాన్ జలసంధిని అడ్డుకోలేదు.
దీనికి ప్రధాన కారణం ఇరాన్ స్వయంగా తన చమురు ఎగుమతుల కోసం జలసంధిని ఉపయోగించడమే. ఈ మార్గాన్ని అడ్డుకుంటే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసే చైనాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియంలు పెరిగే అవకాశం ఉంది. దీని వలన చమురు మరియు గ్యాస్ రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధనం నుండి ఆహారం వరకు ప్రతి ఒక్క దానిపై ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.