Israel-Iran: ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ ధ్వంసం.. ఇరాన్ కూడా తగ్గట్లే…
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధం తీవ్రతరమవుతుంది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ ధ్వంసం చేసింది. ఇరాన్ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారని స్థానిక మీడియా పేర్కొంది.
పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలతో నిండిన చిన్న డ్రోన్లను మోహరించాలని మొస్సాద్‌కు చెందిన ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఇక, ఆ సంస్థ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్లకు సంబంధించిన భాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. మొస్సాద్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని ఇరాన్ సోమవారం ఉరితీసింది.
ఈనెల 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. అప్పటినుంచి ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో ఇరాన్ పలువురు కీలకమైన నేతలను కోల్పోయింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల నివాసాలపై టెహ్రాన్ క్షిపణి దాడులను ప్రారంభించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఈక్రమంలో సోమవారం ఇరాన్ అధికారిక టీవి భవనంపై క్షిపణిని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో ఓ మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా.. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి టెల్ అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతినగా.. సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.







