Trump: సుంకాలు తగ్గింపు దిశగా భారత్… అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక్ష ఒప్పందం..?

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచదేశాలపై టారిఫ్ ల వార్ ప్రారంభించగా.. కొన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకించగా మరికొన్ని మాత్రం చర్చలు ప్రారంభించాయి. ఇదే బాటలో భారత్ కూడా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్యబంధం బలోపేతంగా ఫోకస్ పెట్టింది. అమెరికా మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతూ.. ఒప్పందానికి ఓరూపు తేవడానికి ప్రయత్నించారు.
భారత్ సుంకాలు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఓవల్ ఆఫీస్‌లో పాత్రికేయులతో ఈమేరకు మాట్లాడారు. అయితే ఏ ఉత్పత్తులపై తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు (India-USA).
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై భారత్, అమెరికా అధికారులు వాషింగ్టన్‌లో చర్చలు ప్రారంభించారు. భారత్‌తో ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయని, ఇరు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయని ఇప్పటికే అమెరికా పేర్కొంది. టారిఫ్, టారిఫేతర అడ్డంకులను అమెరికా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన షరతుల(Terms of references)కు ఇరు దేశాలు తుదిరూపునిచ్చాయి కూడా. 90 రోజుల పాటు టారిఫ్ అమలుకు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు రోజుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తరఫు బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.