భారత్ కు ప్రమాద ఘంటికలేనా..?
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. ఇప్పుడు సమస్యల్లో పడనుందా…? పొరుగున రగులుతున్న అంతర్యుద్ధాలు.. దేశాన్ని ఇబ్బందుల పాలు చేస్తాయా..? ఎందుకంటే ఇప్పుడు పొరుగున ఉన్న ఏదేశం కూడా భారత్ కు ఆప్తదేశం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే .. భారత అనుకూల ప్రభుత్వాలు వివిధ కారణాలతో కుప్పకూలుతున్నాయి. ఈపరిణామం ఢిల్లీ వ్యూహకర్తల్లో ఆందోళన పెంచుతోంది.
పొరుగునే ఉన్న మాల్దీవులు.. గతంలో ఇండియాకు చక్కని మిత్రదేశం. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన మొయిజ్జు ప్రభుత్వం.. చైనా అనుకూల విధానాలు అవలంభిస్తోంది. ముఖ్యంగా మొయిజ్జు అయితే… ఎన్నికల ప్రచారంలో భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. వారి మంత్రులైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తూ భారత ప్రధాని మోడీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తర్వాత వారిని ప్రభుత్వం తొలగించింది కూడా. అయినప్పటికీ ఆ కార్చిచ్చు లోపలలోపల కాలుతూనే ఉంది.
మొన్నటికి మొన్న శ్రీలంకలో కూడా ప్రభుత్వం.. ప్రజాగ్రహంతో కుప్పకూలింది. అవినీతి, బంధుప్రీతి, పెరిగిన ద్రవ్యోల్బణం, అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ప్రభుత్వాన్ని కూలదోశారు. అయితే ఈసమయంలో ఆదేశంలో హింసాగ్ని చెలరేగకుండా సాయం రూపంలో భారత్ ఆదుకుంది. కానీ.. ఇప్పటికీ ఆదేశంలో తిష్టవేసిన చైనా.. పెట్టుబడుల రూపంలో బలంగా వేళ్లూనుకుంటోంది. దీంతో భారత్ కు ఇది కాస్త కఠిన పరీక్షగానే చెప్పొచ్చు.
ఇక ప్రజాందోళనతో దేశం విడిచి పారిపోయి ఇండియా వచ్చిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా.. తొలి నుంచి భారత అనుకూలురుగా ముద్ర పడ్డారు. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లా గడ్డ మీద నుంచి ఉగ్రవాదుల రాకను అరికట్టారు. భారత్ తో పలు ఒప్పందాలు చేసుకున్నారు. అలాంటి హసీనాను…ఒకే ఒక్క తప్పు కుర్చీ మీద నుంచి కూలదోసింది. స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబాలకు 30 శాతంరిజర్వేషన్లను ప్రకటించగానే.. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
అయితే దీని వెనక పాకిస్తాన్ ప్రోత్సాహిత జమాతే ఇస్లామీ హస్తమున్నట్లు సమాచారం. అంటే ఉన్న ఒక్క ఆప్త మిత్రురాలి ప్రభుత్వం కూలిపోయింది. ఈ పరిణామంతో భారత్ కూడా అలర్టైంది. మరి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం, ఢిల్లీ వ్యూహకర్తలు ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తారు.అన్నది ఆసక్తికరంగా మారింది. వీటిని చక్కదిద్దకపోతే.. మన భౌగోళిక సమగ్రత ప్రమాదంలో పడడం ఖాయమన్నసంకేతాలు కనిపిస్తున్నాయి.






