మోడీ సంధియత్నాలు ఫలించేనా..?
రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని ప్రపంచం ఆశిస్తోంది.ఏదో ఒక పరిణామం జరగకుంటుందా..? ఇరుదేశాల నడుమ యుద్ధం ముగియకుండా ఉంటుందా..? అని ఆకాంక్షిస్తోంది..? ఇప్పటికే పాశ్చాత్య ప్రపంచదేశాలను.. రష్యా దూరం ఉంచుతోంది. ఆదేశాలన్నీ కలసి ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసి, యుద్ధాన్ని సుదీర్ఘకాలం జరిగేలా చేస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. ఈ కారణంతో అమెరికా సహ ఏ దేశం చెప్పినా పుతిన్ వినేటట్లు లేరు.దీంతో పుతిన్ కు అత్యంత సన్నిహిత, మిత్రదేశం ప్రధాని మోడీ పైనా.. అందరి ఆశలు ఉన్నాయి..
ఇటీవలే రష్యాలో పర్యటించిన మోడీ.. ఆదేశ అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. మోడీని సగౌరవంగా ఆహ్వానించిన పుతిన్.. ఆయనకు సాదర స్వాగతం పలికారు. అదీ కాక.. యుద్ధ సమయంలో పుతిన్ కు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కాగా.. భారత్ మాత్రమే ఆదరువుగా నిలిచింది. రష్యా నుంచి సబ్సిడీ ధరకు ఆయిల్ కొనుగోలు చేసింది. ఈ పరిణామాలతో రష్యాతో భారత్ మితృత్వం మరింతగా పెనవేసుకుపోయిందని చెప్పొచ్చు. అక్కడ ఏం మాట్లాడారో తెలియదు కానీ.. కొద్దిరోజుల్లోనే మోడీ… ఉక్రెయిన్ లో పర్యటించారు.
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఇరు దేశాలు కలసి కూర్చుని సమస్యపై చర్చించుకోవాలని సూచించారు. యుద్ధం కాదు.. చర్చలు, సంప్రదింపులే సమస్య ప రిష్కారానికి అవసరమని … కీవ్ నుంచి మోడీ సూచించారు. తాజా పరిణామాలపై పాశ్చాత్య ప్రపంచం కూడా సానుకూలంగా స్పందించింది‘యుద్ధం విషయంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదు. మొదట్నుంచీ మాది శాంతి పక్షమే’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను బీబీసీ హైలైట్ చేసింది.
‘మోదీ పర్యటన చరిత్రాత్మక ఘట్టం..’ అంటూ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలను లె మొండే ప్రముఖంగా ప్రచురించింది. 1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీయేనని అన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. పరస్పరం పోరాడుకుంటున్న రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మోడీ చొరవ చూపినట్లు పేర్కొన్నాయి. తన పర్యటనల్లో ఇరు దేశాధినేతలను మోడీ ఆలింగనం చేసుకున్న విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.






