Venezuela: వెనెజులాపై అమెరికా ఆక్రమణ.. నికోలస్ దంపతులను బంధించామన్న ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. వెనెజువెలా నుంచి మాదకద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు, హెచ్చరికలు చేస్తూ వచ్చిన ట్రంప్.. ఏకంగా దాడులకు దిగారు. బాంబు పేలుళ్లతో రాజధాని కారకస్ దద్దరిల్లింది. శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో దేశంలో అత్యయిక పరిస్థితి విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ (US President Donald Trump) ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా శనివారం దాడులకు పాల్పడినట్లు వెనెజువెలా వెల్లడించింది. దీంతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ దాడులతో దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వెనెజువెలాపై అమెరికా ఆక్రమణకు దిగిందని నికోలస్ మదురై ఆరోపించారు. పరిస్థితిపై చర్చించేందుకు ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు. మరోవైపు సమస్యను పరిష్కరించాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్.
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కీలక ప్రకటన చేశారు. ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులు పారిపోతుండగా.. తమ దళాలు బంధించాయన్నారు.
అమెరికన్ ఎయిర్లైన్లకు నోటమ్..
ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటమ్ జారీ చేసింది. అమెరికా విమానాలు వెనెజువెలా గగనతలాన్ని వినియోగించొద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వెనెజువెలా (Venezuela) ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను (USA) ముంచెత్తుతున్నాయని ట్రంప్ (Donald Trump) పలుమార్లు పేర్కొన్నారు. ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ఆరోపిస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా.. భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్జెట్లను మోహరించింది.






