Venezuela: మా చమురు కోసమే అమెరికా దొంగనాటకాలు.. డెల్సీ రోడ్రిగ్స్ ఆరోపణలు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది ఒకటైతే.. వెనెజులా విషయంలో జరుగుతోంది మరోలా ఉంది. అధ్యక్షుడిగా ఉన్న మదురోను గద్దెదింపి , అరెస్ట్ చేసి.. న్యాయస్థానం ముందు హాజరుపరిచారు ట్రంప్ యంత్రాంగం. అయితే ఆయన తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైన డెల్సీ రోడ్రిగ్స్.. తన మాట ప్రకారమే నడుచుకోవాలని హుకుం జారీ చేశారు. లేదంటే .. మరింత దారుణంగా శిక్షిస్తామని హెచ్చరించారు కూడా. అయితే అది కూడా బెడిసి కొట్టిందని చెప్పాలి.
అమెరికాపై వెనెజులా తాత్కాలిక ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ దేశంలో చమురు నిల్వలకు సంబంధించి అమెరికా నిర్ణయాలు సరికాదన్నారు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ . మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించి అగ్రరాజ్యం చేస్తున్న ఆరోపణలు సాకులు మాత్రమేనని.. తమ దేశంపై ఒత్తిడి వెనుక ఇంధన వనరులపై అత్యాశే అసలు కారణమని విమర్శించారు. వెనెజువెలా ఇంధన వనరులను ఏళ్లపాటు నియంత్రిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన వేళ ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘‘ఉత్తర ప్రాంతం (అమెరికా) ఇంధన అత్యాశ.. మన దేశ వనరులను కోరుకుంటోందని మీ అందరికీ తెలుసు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఆరోపణలు కేవలం సాకులే’’ అని అన్నారు. పరస్పర సహకారంతో ఇరుపక్షాలు ప్రయోజనం పొందే ఇంధన సంబంధాలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కలిసి పనిచేయాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. దేశంలో అతివాద, ఫాసిస్ట్ భావజాలాన్ని అనుమతించలేమని స్పష్టం చేశారు.
వెనెజువెలా 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.. ఈ ఒప్పందం ద్వారా సమకూరే డబ్బుతో అగ్రరాజ్యంలో తయారైన ఉత్పత్తులనే వెనెజువెలా కొనుగోలు చేస్తుందన్నారు. ఇది రెండు దేశాల ప్రజలకూ ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పారు.






