బంగ్లాధేశ్ లో ఊచకోత వెనక..?
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒకపక్క తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మొహమ్మద్ యూనస్ .ఇవాళ రాత్రి ]ప్రమాణం చేయనుండగా… పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం వైదొలగినా ఆమె పార్టీ అవామీ లీగ్‌కు చెందిన పలువురు నేతలు ఊచకోతకు గురవుతున్నారు. మూడు వారాలకు పైబడిన హింసాకాండలో 469 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. 29 మృతదేహాలను గుర్తించగా వాటిలో 20 అవామీలీగ్ నేతలవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు ఎక్కడికక్కడ వెంటాడి, వేటాడి దాడులకు తెగబడుతున్నారు. అశోక్తలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఇంటికి నిప్పుపెట్టిన ఘటనలో ఐదుగురు టీనేజర్లు, మరొకరు సజీవదహనమయ్యారు. భద్రత బలగాలపైనా, పోలీసు స్టేషన్లపైనా దాడులు తప్పడం లేదు.
సంక్షుభిత బంగ్లాదేశ్‌లో దాడులకు భయపడి అనేక మంది ఆ దేశ పౌరులు ఆశ్రయం కల్పించాలని కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. పశ్చిమబెంగాల్లోని జల్పాయిగుడీ జిల్లా దక్షిణ్ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టు వద్ద వందల మంది బంగ్లాదేశీయులు బారులు తీరినట్లు తెలుస్తోంది. ఇనుప కంచె వద్దకు వచ్చిన వారంతా.. స్వదేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించారని, భారత్‌లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారని స్థానికులు వెల్లడించారు. అయితే, సరిహద్దు మొత్తం మూసివేసి ఉండటంతో వాళ్లు భారత్‌లోకి ప్రవేశించలేకపోయినట్లు బీఎస్ఎఫ్ దళాలు వెల్లడించాయి. అనంతరం వారిని బంగ్లా సరిహద్దు బలగాలు వెనక్కి తీసుకువెళ్లినట్లు తెలిపాయి.
బంగ్లాదేశ్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ఓవైపు ప్రచారం జరుగుతోంది.కానీ.. ఓ పద్దతి ప్రకారం ప్రత్యర్థులను హత్య చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అవామీలీగ్ పార్టీ కార్యకర్తల హత్యలు.. దీనికి బలం చేకూరుస్తున్నాయి. నిరసనలైతే పలానావాళ్లు మాత్రమే చనిపోతారని చెప్పలేరు. అన్ని పార్టీల నేతలకు ఆపరిస్థితి ఉండాలి. కానీ కేవలం హసీనా పార్టీ కార్యకర్తలు మాత్రమే హత్యలకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది..
శాంతియుతంగా ముందడుగు: యూనస్
బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వ సారధి, నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. పారిస్‌లో ఉంటున్న ఆయన గురువారం ఢాకా వెళ్లి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సలహామండలిలో 15 మందికి చోటు దక్కనుంది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం, ప్రతీకారాలకు బదులు శాంతిద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని సూచించారు..






