బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల దావానలం.. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు.. వాటికి దారితీసిన కారణాలను ఓసారి పరిశీలిస్తే..
ఆందోళనలకు కారణాలేంటి..?
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయం వివక్షపూరితంగా ఉందని, స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆవామీ లీగ్ పార్టీ (హసీనా నేతృత్వంలోని) మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో.. రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడం, ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
సుప్రీం తీర్పుతో..
దేశంలో హింస తారస్థాయికి చేరుకున్న తరుణంలో.. వీటిపై బంగ్లా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వం కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించినప్పటికీ.. ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రదర్శనలు కొనసాగాయి. ఇటీవల జరిగిన ఘర్షణలతో సహా మొత్తంగా 300 మంది ఈ ఆందోళనల్లో చనిపోయారు.
ప్రభుత్వం ఏమంటోంది?
దేశంలో తాజా పరిణామాలపై స్పందించిన ప్రధాని షేక్ హసీనా.. ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. విధ్వంసాలకు పాల్పడేవారు నిరసనకారులు కారని.. ఉగ్రవాదులని ఘాటుగా వ్యాఖ్యానించారు. వారిని సంకెళ్లతో బంధించాలన్నారు. అశాంతిని అణచివేసేందుకు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ.. వారు అందుకు నిరాకరించారు.
దేశంలో ఆందోళనలు తీవ్రమవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతోపాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామి పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఈ పార్టీలే హింసకు ఆజ్యం పోశాయని దుయ్యబట్టింది. విపక్షాలు మాత్రం.. ఆందోళనలకే మద్దతు ఇచ్చామని, అశాంతికి తాము కారణం కాదని పేర్కొంటున్నాయి. చివరకు ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా.. దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.






