బంగ్లాదేశ్ లో ఆగని అల్లర్లు.. ప్రపంచదేశాల ఆందోళన…
బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దాంతో ఆయన దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు.
బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని, అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా.. ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది.
ఇప్పటికే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అల్లర్లను నిరోధించేందుకు ప్రయత్నిస్తోంది. అల్లర్లు ఆపకపోతే.. ఇంకేమీ లేదంటూ ఇటీవలే ఆయన స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. బీఎన్పీ అధినేత ఖలీదా జియా కూడా.. శాంతియుతంగా ఉండాలని బంగ్లా ప్రజలకు సూచించారు.అయితే యువత మాత్రం… తాము అనుకున్నది జరిగితేనే ఆందోళనలు విరమిస్తామంటున్నారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగడం.. హింసాకాండ తీవ్ర రూపు దాలుస్తోంది.
మరోవైపు పొరుగుదేశంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. వేగంగా అక్కడి పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశిస్తోంది. మరీ ముఖ్యంగా హిందువులపై అత్యాచారాలు, ఆస్తులవిధ్వంసం ఘటనలను సీరియస్ గా పరిగణిస్తోంది. ఇలాంటివి జరగకుండా అక్కడి సర్కార్ చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.మరోవైపు.. తమను భారత్ లోకి అనుమతించాలంటూ వేలాది మంది బంగ్లాజాతీయులు .. సరిహద్దుల్లో వెయిట్ చేస్తున్నారు. తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని బీఎస్ఎఫ్ చెబుతున్నా.. వారు మాత్రం దీక్షలకు దిగుతున్నారు.






