Donald Trump: పాకిస్తాన్ ఆర్మీపై ట్రంప్ లవ్.. జాతీయమీడియా సంచలన విషయాలు
పెద్దన్న అమెరికా(America).. మన దాయాది పాకిస్తాన్(Pakistan) విషయంలో చూపిస్తున్న ప్రేమ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ దేశ సైన్యాధ్యక్షుడు మునీర్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లంచ్ పార్టీ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా మన జాతీయ మీడియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భారత్ తో యుద్దంలో వెనక్కు తగ్గడంపై ట్రంప్.. మునీర్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో అసలు భారత్ ప్రస్తావన చాలా తక్కువ అనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఇద్దరూ ఇరాన్(Iran) గురించి కూడా మాట్లాడుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం నేపధ్యంలో ట్రంప్.. ఇరాన్ పై దాడికి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా.. పాకిస్తాన్ నుండి ఏమి కోరుకుంటుంది.. పాకిస్తాన్ ఏం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అసలు అమెరికా అడిగింది చేస్తే పాకిస్తాన్ కు వచ్చే ప్రతిఫలం ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ఇరాన్ పై తాము దాడి చేస్తే.. పాకిస్తాన్ సైన్యం సహకారం తీసుకోవాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పాక్ భూభాగం నుంచి అమెరికా బలగాలు దాడి చేసే దిశగా.. ట్రంప్ సర్కార్ ప్రణాలికలు రచిస్తోంది. ఇందుకు అవసరమైతే పాకిస్తాన్ కు ఆర్ధిక సహాయం చేయడానికి సైతం అమెరికా రెడీ అవుతోంది. ఇక భారత్ విషయంలో కూడా చర్చ కొంత జరిగి ఉండవచ్చనే అనుమానాలు సైతం బలపడుతున్నాయి. వీళ్ళ ఇద్దరి మధ్య పీఓకే గురించి.. అలాగే అక్కడి నుంచి వెళ్తున్న చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందనే వాదన సైతం బలపడుతోంది.
కాశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య సయోధ్య కోసం పాకిస్తాన్ ను ముందు ఒప్పించాలని కూడా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో.. పాకిస్తాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ట్రంప్ కంపెనీలు, ట్రంప్ వ్యాపార భాగస్వాములు.. పాకిస్తాన్ సైన్యం ఆధ్వర్యంలో పాకిస్తాన్తో క్రిప్టోకరెన్సీపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. ట్రంప్ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనం పొందే దిశగా కూడా ఈ సమావేశం జరిగినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఏది ఎలా ఉన్నా ఈ ఇద్దరి భేటీ.. భారత్ తో పాటుగా ముస్లిం దేశాల్లో సైతం చర్చనీయంశంగా మారింది.







