అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అమెరికా..
భారత్ దౌత్యరంగంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా చొరబాట్లతో భారత్ భూభాగాన్ని కబళించాలని భావిస్తున్న చైనాకు బుద్ధిచెప్పేలా ఉందా విజయం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా.. అరుణాచల్ ప్రదేశ్ భారతభూభాగమే అని స్పష్టం చేసింది. భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ.. భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు.
వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో భారత సైన్యాన్ని మరింత శక్తిమంతం చేయడంపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఓ కార్యక్రమంగా రూపొందించి, అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల ప్రధాని మోడీ పర్యటించారు. చైనా- భారత్ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు.
అయితే, ఈ రాష్ట్రాన్ని చైనా ‘జాంగ్నన్ (దక్షిణ టిబెట్)’గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోడీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగమంటూ మళ్లీ పాత పాటే పాడడం మొదలుపెట్టింది. అంతేకాదు.. అక్కడి క్రీడాకారులకు వీసాలను నిరాకరిస్తోంది. వారు జాంగ్ నన్ ప్రాంతానికి చెందిన వారంటూ వారికి వీసాలు అక్కర్లేదన్న వాదన తెస్తోంది. అంతేకాదు.. ఆ ప్రాంతం తమదేనని .. దాన్ని ఆక్రమించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నట్లు కలరింగ్ ఇస్తోంది. తొలిపాలకుడైన మావో ఐదు వేళ్ల సిద్దాంతాన్ని చైనా తూ.చ. తప్పకుండా అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే అరుణాచల్ ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు తమ సైనికులను అక్కడికి పంపి, కొన్ని కిలోమీటర్ల ప్రాంతాన్ని కబ్జా చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌పై కొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తోంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ అసంబద్ధ వాదనలకు దిగారు. దీన్ని భారత్ దీటుగా తిప్పికొట్టింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయరాని భాగమని, నిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్‌కు మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.






