Rajya Sabha: రేపే నామినేషన్లకు డెడ్ లైన్..!! విజయసాయి సీటు ఎవరికో..??

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగియనుంది. గడువు సమీపిస్తున్నప్పటికీ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి అన్నామలై (Annamalai), స్మృతి ఇరానీ (Smriti Irani), మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీళ్లలో ఎవరు బరిలోకి దిగుతారనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు.
విజయసాయి రెడ్డి, ఈ ఏడాది జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వం 2028 జూన్ 21 వరకు ఉంది. అయితే ఆయన రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ 30న, అభ్యర్థుల ఉపసంహరణకు మే 2 గడువుగా నిర్ణయించింది. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి (NDA) అసెంబ్లీలో సంపూర్ణ ఆధిక్యత ఉంది. కాబట్టి ఈ స్థానం నుంచి కూటమి తరపున ఎవరు పోటీ చేసినా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Dy CM Pawan Kalyan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై గతవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) చంద్రబాబు సమావేశమై చర్చించారు.
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్లు రాజ్యసభ రేసులో ఉన్నాయి. మందకృష్ణ మాదిగ పేరును అమిత్ షాకు చంద్రబాబు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాదిగ సామాజిక వర్గంలో మందకృష్ణకు గణనీయమైన పట్టుంది. ఈ నేపథ్యంలో మాదిగ సామాజికవర్గంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకు బీజేపీ మందకృష్ణను ఎంచుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే సమయంలో అన్నామలై పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవలే ఆయన్ను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి హైకమాండ్ తప్పించింది. దీంతో ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. అన్నామలైతో నారా లోకేశ్ కు సత్సంబంధాలున్నాయి. కోయంబత్తూర్ నుంచి అన్నామలై ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన కోసం లోకేశ్ (Nara Lokesh) అక్కడికెళ్లి ప్రచారం కూడా చేశారు. దీంతో అన్నామలై పేరు కూడా ఎంపీ రేసులో బలంగా వినిపిస్తోంది. స్మృతి ఇరానీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నందున ఆమె పేరు కూడా చర్చలో ఉంది. అయితే ప్రస్తుతం ఆమె రేసులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. విజయసాయి రెడ్డే మళ్లీ బరిలోకి దిగుతారని కొంతకాలం కిందట వరకూ ప్రచారం జరిగింది. ఆయితే తాను రాజ్యసభ రేసులో లేనని ఇటీవల ఆయన స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.
రేపటితో నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో, బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం ఎవరిపై వేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మందకృష్ణ మాదిగ, అన్నామలై, స్మృతి ఇరానీలలో ఎవరు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రాతినిధ్యం వహిస్తారనేది త్వరలో తేలనుంది.