బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు..
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది. దాంతో సైన్యం రంగంలో దిగింది. దేశం మొత్తం దాని నియంత్రణలోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు.
‘‘మేం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నిరసనల వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ హింసను ఆపాల్సిన సమయం ఇది. నా ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితుల్లో మార్పు వస్తే.. అత్యయిక స్థితి అవసరం ఉండదు’’ అని ఆర్మీ చీఫ్ టీవీ ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. అప్పుడే హసీనా రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించారు. దీనికి ముందు షేక్ హసీనాకు ఆర్మీ అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాజీనామా చేసి, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. త్రిపుర రాజధాని అగర్తలకు హసీనా చేరుకున్నారని తెలుస్తుంది. అక్కడి నుంచి లండన్‌కు వెళ్లనున్నారని సమాచారం.
ఈ పరిణామాల వేళ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని యత్నించే ప్రతిఒక్కరిని అడ్డుకోవాలని సైన్యాన్ని కోరారు. ‘‘ప్రజలను, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం మీ బాధ్యత. ఎన్నిక కాని ప్రభుత్వం అధికారంలో కూర్చోవడానికి ఒక్క నిమిషం కూడా అనుమతించ్చొద్దు. ప్రధానిని గద్దె దించితే మన సాధించిన అభివృద్ధి అంతా మట్టిలో పోసినట్టవుతుంది. తిరిగిమళ్లీ పుంజుకోలేదు. మనం అలాంటి పరిస్థితిని కోరుకోం’’ అని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఆయన ప్రధానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.






