IPS Sunil Kumar: ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్..! నెరవేరిన రఘురామ కోరిక..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు సీఐడీ చీఫ్ (CID Chief)గా పనిచేసేవారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (IPS Sunil Kumar). నాటి ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ (RRR Custodial torture case) కేసులో సునీల్ కుమార్ హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ (YS Jagan) ఓడిపోయి చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ కు పంపించింది. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అయితే తాజాగా సునీల్ కుమార్ ను సస్పెండ్ ( Sunil Kumar suspension) చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే రఘురామ కృష్ణరాజు (RRR) కేసులో కాకుండా మరో అంశంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
తనను కస్టడీకి తీసుకుని హింసించారని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కష్ణరాజు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై కేసు నమోదైంది. విచారణ జరుగుతోంది. ఈ కేసులో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కూడా రఘురామ కృష్ణరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే సునీల్ కుమార్ పై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం ప్రదర్శిస్తోందంటూ రఘురామ కృష్ణరాజు అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన కోరిక నెరవేరినట్లయింది.
ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన (Foreign trips) కేసులో ఐపీఏస్ అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులెవరూ దేశం విడిచి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ సునీల్ కుమార్ దీన్ని ఉల్లంఘించారు. పలుమార్లు దేశం విడిచి వెళ్లారు. ఒక దేశానికి అనుమతి తీసుకుని మరో దేశానికి వెళ్లారు. 2020 నుంచి 2024 మధ్య పలుమార్లు ఆయన యూఏఈ, అమెరికా తదితర దేశాలకు వెళ్లారు. మరోసారి అనుమతి లేకుండా స్వీడన్ వెళ్లారు. అమెరికా వెళ్లారు. జార్జియా వెళ్తున్నట్టు అనుమతి తీసుకుని యూఏఈ వెళ్లారు.
పీవీ సునీల్ కుమార్ అక్రమ సంపాదనను విదేశాల్లో పెట్టుబడి పెట్టారని, అక్కడ ఆయన కుటుంబీకులు పలు వ్యాపారాలు చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన యూఏఈ, అమెరికా లాంటి దేశాలకు పలుమార్లు వెళ్లి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ విధించడంతో రఘురామ కృష్ణరాజు కోరిక నెరవేరినట్లయింది. అంతేకాక.. విదేశీ పర్యటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపుతోందని.. అప్పటి వరకూ ఆయన విజయవాడ దాటి వెళ్లేందుకు వీలు లేదని జీవోలో పేర్కొంది.