Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి అన్నామలై ఔట్.. ఇంతకూ ఏం జరిగింది?
సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయంలో తమిళనాడు బీజేపీ (BJP)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆపార్టీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న అన్నామలై (Annamalai)… తాను అధ్యక్ష రేసులో లేనని స్వయంగా ప్రకటించారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఈ పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఇటీవల అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పొత్తులో చర్చల్లో భాగంగా బీజేపీ చీఫ్‌గా అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు సమాచారం.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ అని, నాకు ఈ పార్టీ బాగుండాలి, మంచి వాళ్లు, మంచి మనసులు, మంచి పనులు చేసిన వాళ్లు ఉండే పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని తాను అని అన్నామలై అన్నారు.
శుక్రవారం కోయంబత్తూర్‌లో అన్నామలై మాట్లాడుతూ.. ‘‘ బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అని అన్నారు. ‘‘పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ పార్టీ వృద్ధి కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు. ఈ పార్టీకి నేను ఎల్లప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘‘నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందిచబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అన్నారు. బీజేపీ పార్టీ వేరే పార్టీ లాగా అధ్యక్ష పదవికి 50 మంది నామినేషన్లు దాఖలు చేసే పార్టీ కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే, తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళిసై(Tamilisai) సౌందర్‌రాజన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో ఈమె తెలంగాణ గవర్నర్‌గా కూడా పనిచేశారు. మహిళ కావడం, ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకం కావడంతో పార్టీ ఈమెను అధ్యక్షురాలిగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్, కోయంబత్తూర్ మురుగానందం పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అన్నామలై చేపట్టిన ‘‘ఎన్ మన్-ఎన్ మక్కళ్’’ యాత్ర విజయవంతం కావడంలో మురుగానందం కీలక పాత్ర పోషించారు.






