Tehran: యుద్ధక్షేత్రంగా ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ టెహ్రాన్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) హడావుడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నామని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించిన వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లైంది.
అణుకేంద్రాలపై దాడి..?
ట్రంప్ హడావుడిగా సిట్యుయేషన్ రూమ్‌ను సిద్ధం చేయించి.. వాషింగ్టన్‌కు తిరిగి రానుండటంతో.. అమెరికా కూడా ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్‌తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవుండే జీబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సిందే. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన బి-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియగో గార్సియా బేస్‌కు చేర్చింది. దీనికితోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ దేశ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయల్దేరింది. ఓ పోర్టు విజిట్‌ను కూడా రద్దు చేసుకొని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కట్టడం పరిస్థితి తీవ్రతను నిర్దేశిస్తోంది. దీంతోపాటు డెస్ట్రాయర్లు ఇతర సహాయక నౌకలూ వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్‌జెట్లను మోహరిస్తుండటం టెన్షన్ పెంచుతోంది.
ఫార్దోను ధ్వంసం చేయడం.. అమెరికాకు అత్యంత కీలకం
ఇరాన్‌లోని ఫార్దో అణుకేంద్రంలో యురేనియంను 60 శాతానికి పైగా శుద్ధి చేయగలరు. ఇది అణుబాంబులు తయారీ చేయడానికి అవసరమైన దానికి చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7శాతం శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. అణుబాంబుకు అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉంది. ఫార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజులు ఉన్నట్లు అంచనా. దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే దీనిని ధ్వంసం చేయడం అమెరికా, ఇజ్రాయెల్‌కు చాలా ముఖ్యం.
ఇరాన్‌లోని అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. నతాంజ్‌లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా అంతరాయాలు వంటివి చోటుచేసుకొని అక్కడి మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్‌లు దెబ్బతిని ఉండొచ్చన్నారు. అంతేకానీ ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం లేదని వెల్లడించారు. నతాంజ్, ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి.