ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టిఎల్ సిఏ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

టిఎల్ సిఏ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మాతృదేశానికీ, ఊరికి దూరంగా ఉండికూడా ఏమాత్రం తగ్గకుండా విదేశాలలోనూ ప్రవాసాంధ్రులు మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. అమెరికాలో ప్రఖ్యాత తెలుగు సంస్థ టి.ఎల్‌.సి.ఏ 2016 సంవత్సర సంక్రాంతి సంబరాలు నూతన అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారి ఆధ్వర్యంలో జనవరి 24,2016 గణేష్‌ టెంపుల్‌ ఆడిటోరియం, ఫ్లషింగ్‌, న్యూయార్క్‌ నగరంలో ఘనంగా జరిగాయి. దాదాపు 450 మంది సభ్యులు  తీవ్రంగా పడిన మంచునీ, చలినీ లెక్కచేయక టిఎల్‌సిఏ సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.

అత్యంత తక్కువ వ్యవధిలో శ్రీ సత్య చల్లపల్లి గారి టీం అహర్నిశలూ శ్రమించి, అనుకొని ఉపద్రవం మంచుతుఫాను వల్ల కురిసిన మంచుని సైతం లెక్కచేయక సంక్రాంతి సంబరాలను ఆహుతులు అబ్బురపరిచేలా నిర్వహించారు. మధ్యాహ్నం ప్రారంభమైన కార్యక్రమాలు దాదాపు 3 గంటల సేపు వైవిద్యభరితమైన చిన్నారుల నృత్యాలు, ఆటపాటలతో ఆహుతులను అలరించాయి. 67 వ భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని దేశభక్తి గీతాలతో కూడిన సందేశాత్మక నృత్య నాటికను ప్రదర్శించారు. మంచు కురిసే వేళలోనూ రమ కుమారి వనమ ఆధ్వర్యంలో పసందైన విందు బోజనం ఆహుతులకు అందించారు.

సంస్థ కార్యదర్శి తాపీ ధర్మరావు, సంస్థ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ గూడూరు తమ తొలి పలుకులతో ఆహుతులను కళాకారులను ఆహ్వానించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చిన్నారుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. కుమారి శబరి ఆధ్వర్యంలో టిఎల్‌సిఏ సభ్యులు ప్రదర్శించిన ''సంక్రాంతి పండుగ నృత్యరూపకం'' పండుగ ప్రాశస్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి ఆహుతులను ఆకట్టుకుంది. కోరియోగ్రాఫర్‌ ఉమపుటాని ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన జయహో నృత్యరూపకం ఆహుతుల జయజయ ధ్వానాలను అందుకుంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన సినీ నటుడు సుమన్‌ గారిని టిఎల్‌సిఏ అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుమన్‌ గారు ప్రవాసాంధ్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. మిమిక్రీ కళాకారుడు రమేష్‌ గారు తమదైన శైలితో ప్రదర్శించిన హాస్య రసవత్తర సన్నివేశాలు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను నవ్వులతో ముంచెత్తింది. నటి సౌమ్యరాయ్‌ ప్రత్యేక అతిదిగా పాల్గొన్నారు.

గాయకులు ఉష, పృథ్వి పాడిన సినీ గీతాలు ''మళ్లి మళ్లి ఇది రానిరోజు ... మంచుకురిసే వేళలో''  మధుర గీతాలు ఆహుతులను మైమరపించారు. అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారు స్వాగతోపన్యాసం చేస్తూ,  టిఎల్‌సిఏ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ఐక్యతతో కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన తోటి సహచర సభ్యుల కృషిని కొనియడారు. మద్దిపట్ల ఫౌండేషన్‌ వారు సంక్రాంతి ప్రత్యేక బహుమతులు 40 టీవీ లు విజేతలకు అందించారు. టిఎల్‌సిఏ అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారు కార్యక్రమం విజయవంతం చేయడానికి అండగా నిలిచిన దాతలను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో అండగా నిలిచిన సంస్థ కార్యదర్శి తాపీ ధర్మారావు, అలాగే ఈ సంక్రాంతి సంబరాల సాంస్కృతిక  కార్యక్రమాల ఎంపికకు కృషి చేసిన నంస్థ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ గూడూరు, కీలకమైన ఈవెంట్‌ ప్లానింగ్‌ నిర్వహించిన కోశాధికారి అశోక్‌ చింతకుంట, ప్రచారబాధ్యతలు నిర్వహించిన హరిశంకర్‌ రసపుత్ర, మరియు సహాయ కార్యదర్శి బాబు కుదరవల్లి, ఉపకోశాధికారి జయప్రకాశ్‌ ఇంజాపురి, టిఎల్‌సిఏ కార్యవర్గ సభ్యులు జ్యోతి జాస్తి, శిరీష తునుగుంట్ల, ప్రసాద్‌ కోయి, ఉమారాణి రెడ్డి లకు టిఎల్‌సిఏ అధ్యక్షులు శ్రీ సత్య చల్లపల్లి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Click here for Event Gallery

 

Tags :