ASBL NSL Infratech

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి.

బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడుతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ క్రతువులో సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు.

అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్‌ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా, ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.

నలుమూలలా ఆధ్యాత్మికం

ఆలయం చుట్టుపక్కల ఎటుచూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చే భక్త జనులకు స్వాగతం పలకడానికి, యాదాద్రి వైభవాన్ని చాటేందుకు హైదరాబాద్‌ నుంచి యాదాద్రి పట్టణం వరకు రహదారులపై, యాదాద్రికి చుట్టూ నిర్మించిన రింగ్‌ రోడ్డు మీదుగా ఆలయానికి వచ్చేదారుల్లో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, మండప ప్రాకారాలు, మాడ వీధులు.. ఇలా అన్నింటినీ పూలతో అలంకరించారు. ఏడు వర్ణాలలో చేపట్టిన విద్యుత్తు కాంతుల్లో ఆయా నిర్మాణాలు రాత్రివేళ నేత్రపర్వంగా కన్పిస్తున్నాయి. క్షేత్రం యావత్తు పచ్చందాలతో కనువిందు చేసేలా గ్రీనరీని అభివృద్ధి చేశారు. వీవీఐపీలు కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. భక్తులను కొండపైకి చేర్చడానికి ‘యాదాద్రి దర్శిని’ పేరుతో ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దారు. ‘యాదాద్రి జలప్రసాదం’ పేరుతో వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. విష్ణు పుష్కరిణి, లక్ష్మీ పుష్కరిణిని సోమవారం ఉదయం ప్రారంభిస్తారు. దీక్షాపరుల మండపాన్ని కూడా ప్రారంభించి, అందులోనే భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు.

 

Tags :