ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎపి భవిష్యత్తును మార్చేలా గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు ఏర్పాట్లు

ఎపి భవిష్యత్తును మార్చేలా గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. మార్చి మూడు, నాలుగు తేదీలలో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సు ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వల్లవన్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ తదితరులతో ఇటీవల పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సు ప్రధానవేదికను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా బీచ్‌ రోడ్‌లోని ఎంజీఎం పార్క్‌లో సదస్సుకు వచ్చే అతిథులకు డిన్నర్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఆ ప్రాంతాన్ని కూడా వీరు పరిశీలించారు.

అనంతరం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై, సదస్సు నిర్వహణకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఆ తర్వాత విశాఖ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి అమర్నాథ్‌, కరికాల వల్లవన్‌ సమావేశమై గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సును ఏ విధంగా విజయవంతం చేయాలన్న విషయమై వారికి వివరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తల నుంచి వీరు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్‌ మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులు నిర్వహించలేకపోయామని, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్న వనరులు, మానవ వనరులను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు చూపించాలన్నది ప్రధానోద్దేశం అని అన్నారు. ఈ సదస్సు వలన రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని అన్నారు. విశాఖపట్న-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, బెంగళూరు-చెన్నై కారిడార్లను అభివృద్ధి చేసి తద్వారా, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి అమర్నాథ్‌ చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సుమారు 50 వేల ఎకరాల భూమిని సిద్ధం చేశామని ఆయన చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, భావనపాడు మైనర్‌ పోర్టుగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తుందని, పారిశ్రామికరంగంలో నిపుణులు, పారిశ్రామిక వేత్తలతో చర్చించిన తర్వాతే ఈ పాలసీని అమలులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. అలాగే ఉమెన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమర్నాథ్‌ తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లను యుద్ధ ప్రాతిపదిక మీద అభివృద్ధి చేస్తున్నామని, రామయ్యపట్నం పోర్టుకు 2024లో తొలి నౌక వస్తుందని అమర్నాథ్‌ చెప్పారు.

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో 200 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, రెండో రోజు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య ఎంవోయూలు జరుగుతాయని అమర్నాథ్‌ చెప్పారు. గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా ఈ సదస్సు జరగబోతుందని, కొన్ని పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అలాగే కచ్చితంగా రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసే యాజమాన్యాలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుంటామని కూడా అమర్నాథ్‌ తెలియజేశారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపించామని, సుమారు 2000 నుంచి 2500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారని ఆయన చెప్పారు. 

ఈ సదస్సులో 13 రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుందని ఇందులో ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, పెట్రోలియం మరియు పెట్రో కెమికల్స్‌, హెల్త్‌ కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్మెంట్స్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఇంట్రెస్ట్రక్చర్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఎమ్మెస్‌.ఎం.ఇ, స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌, టెక్స్టైల్స్‌ అండ్‌ అపరల్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ రంగాలపై చర్చలు జరుగుతాయని అని పేర్కొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రంలో ఎంఎస్‌ఎమ్‌ఈల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

కాగా ఈ సదస్సుకు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలే బ్రాండ్‌ అంబాసిడర్‌ వ్యవహరిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వనరులు తదితర అంశాలపై వీరే ప్రమోట్‌ చేస్తారని చెప్పారు. పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వల్లవన్‌ మాట్లాడుతూ నిబద్ధత, నమ్మకం కలిగిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న విధానం అందుబాటులో ఉందని చెప్పారు. మేజర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రం కూడా ఇదేనని, ఆరు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన, రాష్ట్ర ఎంఎస్‌ఎం ఈ బోర్డు చైర్మన్‌ రవీంద్రనాథ్‌, సిఐఐ చైర్మన్‌ ధీరజ్‌, మ్యారిటైమ్‌ బోర్డ్‌ చైర్మన్‌ కాయ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులతో మంత్రి అమర్నాథ్‌ భేటీ

ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరగనున్న రెండు అంతర్జాతీయ సదస్సులను విజయవంతం చేసేందుకు వివిధ పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలోని భారీ పరిశ్రమల ప్రతినిధులతో స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన కన్సల్టెంట్‌ కం ఇంట్రాక్షన్‌ మీటింగ్లో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడారు.  మార్చి మూడు, నాలుగు తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సు విశాఖపట్నంలో నిర్వహించనున్నామని, అదే నెల 28,29,30వ తేదీలలో భారతదేశం నాయకత్వం వహిస్తున్న జీ 20 సదస్సు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని చెప్పారు.

ఈ సమావేశానికి 45 దేశాలకు చెందిన సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని అని చెప్పారు. ఇటువంటి జి20 సదస్సులు దేశంలోని 50 ప్రాంతాలలో నిర్వహించనున్నారని, మౌలిక సదుపాయాల అంశంపై విశాఖ నగరంలో జీ 20 సదస్సు జరగబోతుందని మంత్రి అమర్నాథ్‌ తెలియజేశారు. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమివ్వటం మనమంతా గర్వంగా భావించాలని, ఈ సదస్సును విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక రంగంలో 75% ఆదాయాన్ని సమకూర్చుతున్న దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం గమనార్హమని మంత్రి అమర్నాథ్‌ తెలియజేశారు.

గతంలో విశాఖ నగరంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరిగాయని, ఆయా సదస్సులను దృష్టిలో పెట్టుకుని నగరంలో తాత్కాలిక సుందరీ కారణ పనులు చేపట్టారని, ఈసారి ఆ విధంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలని మంత్రి అమర్నాథ్‌ విజ్ఞప్తి చేశారు. పనుల నాణ్యత కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. నగర సుందరీకరణకు సంబంధించి ఏ పనులు చేయాలో ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేశామని వీటిలో ఏ పనులునైనా పరిశ్రమల యాజమాన్యాలు తీసుకుని పూర్తి చేయవచ్చని ఆయన సూచించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్‌ రోడ్డును అభివృద్ధి చేయడం, నగరంలో ఉన్న పర్యాటక కేంద్రాలను విదేశీయులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం వంటి పనులు శరవేగంగా చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే అరకు కాఫీ మ్యూజియం వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సుందరీకరించాలని అమర్నాథ్‌ కోరారు.

 

 

 

Tags :