ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఐదు టవర్లుగా సచివాలయం

ఐదు టవర్లుగా సచివాలయం

రాజధాని ప్రభుత్వ భవన సముదాయ ఆకృతుల రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ముఖ్యంగా హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుదిరూపానికి వచ్చింది. శాసనసభ భవంతి ఆకృతులలో కొద్దిపాటి మార్పులను సూచించిన ముఖ్యమంత్రి- త్వరలో ఆ నమూనాలను చూపించి సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్దేశించారు. 

లండన్‌లో నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండురోజుల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాలలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతుల నమూనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన రెండోరోజు సమావేశంలో వీటిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

త్వరలో భవన సముదాయ నిర్మాణ పనులు ప్రారంభం

పరిపాలన నగర నిర్మాణంలో ఇక జాప్యం చేయరాదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెండు ముఖ్యమైన భవంతుల ఆకృతుల నమూనాలను జాప్యం చేయకుండా తయారుచేసి, కొద్ది రోజుల్లోనే తనకు చూపించాలని ముఖ్యమంత్రి ఆర్కిటెక్టులకు చెప్పారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి త్వరలో అన్నీ పూర్తయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. 

ఆకృతులు, శిల్పరూపాలపై తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలను, రాజధాని కమిటీ సూచనలను, ప్రభుత్వవర్గాలోను, ప్రజలలోనూ వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయమని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి చంద్రబాబు నాయుడు సూచించారు. 

హైకోర్టు ఆకృతి ఓకే..

హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుది రూపానికి వచ్చింది. ముఖద్వారం, భవనంలో ఇతర భాగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆ మార్పులు కొన్ని రోజులలోనే పూర్తిచేసి నిర్మాణ పనులు వేగిరం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

శాసనసభ ఆకృతిపై చర్చ

శాసనసభకు సంబంధించి నిన్న నార్మన్ ఫోస్టర్ ప్రదర్శించిన ఆకృతులపై వివరంగా చర్చ జరిగింది. నిన్న ఇచ్చిన ఆకృతులతో పాటు తొలిరోజుల్లో ఫోస్టర్ సమర్పించిన పొడవైన స్థంభాకారంలో ఉన్న ఆకృతిని మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ రెండింటిపై విపులంగా అధ్యయనం చేసి, వాటిల్లో ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరచి నమూనాలను తయారుచేసి చూపించమని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నమూనాలు తయారయ్యాక వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

Click here for PhotoGallery

 

Tags :