ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు

శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు

హైదారాబాద్‌లోని ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరం సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు సుందరంగా ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్‌ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్‌, గార్డెన్‌లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు.

 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో  ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్‌, ముక్తినాథ్‌, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. 

మరోవైపు ఈ ప్రాంతానికి రావడానికి వీలుగా ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.  ఎన్‌హెచ్‌ 44 నుంచి పెద్దషాపూర్‌ తండా చౌరస్తా-గొల్లూరు-అమీర్‌పేట్‌ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఎన్‌ 44 మదనపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి ముచ్చింతల్‌ మీదుగా చిన్న తూప్రాన్‌ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు.  కరెంట్‌ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్‌ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్‌ ఆవరణలో తాత్కాలిక విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్‌ ప్రధాన లైన్‌ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్‌ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు.   

 

Tags :