Sashi Tharoor: శశి థరూర్ దెబ్బకు గింజుకుంటున్న కాంగ్రెస్..!!

భారతదేశం ఇటీవల ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం అత్యంత విజయవంతంగా నిర్వహించింది. అయితే దాని రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కల్లోలాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Sashi Tharoor).. ఆపరేషన్ సిందూర్ ను సమర్థించడం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అస్సలు నచ్చట్లేదు.
ఆపరేషన్ సిందూర్‌ను శశి థరూర్ గట్టిగా సమర్థించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో (Pahalgam) జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పడం ఈ ఆపరేషన్ ఉద్దేశం. అది సఫలమైంది” అని థరూర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ ఆపరేషన్ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా కురేషీలు ప్రదర్శించిన వృత్తి నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. ఈ వ్యాఖ్యలు థరూర్‌ను అంతర్జాతీయ వేదికలపై భారత వైఖరిని గట్టిగా వినిపించే నాయకుడిగా నిలిపాయి. అయితే, ఆయన వైఖరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి (Congress high Command) రుచించలేదు.
కాంగ్రెస్ పార్టీ.. ఆపరేషన్ సిందూర్‌ను సమర్థిస్తూనే, దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన భారత్-పాకిస్తాన్ యుద్ధవిరమణ ఒప్పందాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఒప్పందం భారత బలహీనతను బయటపెట్టిందని విమర్శించింది. 1971లో ఇందిరా గాంధీ పాకిస్తాన్‌ను చీల్చి బంగ్లాదేశ్‌ను సృష్టించిన చరిత్రకు భిన్నంగా ఉందని తెలిపింది. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇందిరా గాంధీ ధైర్యాన్ని కొనియాడుతూ “ఇండియా మిస్సెస్ ఇందిరా” అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి.
అయితే, శశి థరూర్ ఈ విమర్శలకు భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. “1971 పరిస్థితులు వేరు, 2025 పరిస్థితులు వేరు. ఇందిరా గాంధీ 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం నైతిక లక్ష్యంతో పోరాడారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌పై నిరంతరం షెల్లింగ్ చేయడం లక్ష్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. పార్టీ వైఖరికి విరుద్ధంగా వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా థరూర్ “లక్ష్మణ రేఖ” దాటారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.
మే 14న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ విషయం తీవ్రంగా చర్చకు వచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, జైరాం రమేశ్, సచిన్ పైలట్ వంటి సీనియర్ నేతలు హాజరైన ఈ సమావేశంలో, పార్టీ ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడం సరికాదని థరూర్‌కు స్పష్టమైన సందేశం అందించినట్లు సమాచారం.
థరూర్ వైఖరి కాంగ్రెస్‌లో ఆయన స్థానాన్ని మరింత బలహీనపరిచింది. గతంలోనూ ఆయన పలు సందర్భాల్లో పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం వల్ల అధిష్టానంతో దూరం పెరిగింది. ఇప్పుడు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని కలిగించవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. థరూర్ ఒక అసాధారణమైన వక్త, అంతర్జాతీయ వేదికలపై భారత దృక్పథాన్ని సమర్థవంతంగా వినిపించగల నాయకుడు. ఆయన సామర్థ్యాన్ని పార్టీ సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఆయనను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.