Delhi: విపక్షనేతగా రాహుల్ అత్యంత సమర్థుడు.. కాంగ్రెస్ అగ్రనేతకు పట్టం కడుతున్న సర్వేలు..

పప్పు.. పప్పు .. ఇది రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ (Rahul) పై బీజేపీ, ఎన్డీఏ కూటముల విమర్శలు. అంతేకాదు.. యువరాజు ట్యాగ్ లైన్ తగిలించి మరీ ఆడుకునేవాళ్లు. రాహుల్ సైతం పిల్ల చేష్టలతో తన నైజాన్ని బయటపెట్టుకునేవారు. ఒకానొక సందర్బంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం..రాహుల్ ను ఓ విద్యార్థితో పోల్చారు. టీచర్ ను ఆకట్టుకునేందుకు విద్యార్థి ప్రయత్నించినట్లు.. రాహుల్.. తనతో ప్రవర్తించారని చెప్పుకొచ్చారు కూడా.
దీంతో విపక్షాలకు నాయకత్వం వహించేందుకు మమతా బెనర్జీ, శరద్ పవార్ , కేజ్రీవాల్ సహా పలువురు నేతలు మేమున్నామంటూ ముందుకొచ్చిన సందర్భాలు చూశాం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. రాహుల్ .. విపక్షాలకు నాయకత్వం వహించేస్థాయికి చేరారు. అంతేనా మోడీ సర్కార్ ను అయితే.. ఓ ఆట ఆడేస్తున్నారు. మోడీ, అమిత్ షా లాంటి కాకలు తీరిన రాజకీయ దిగ్గజాలు సైతం.. రాహుల్ ను టచ్ చేయడానికి ఇష్టపడడం లేదు. కానీ రాహుల్ మాత్రం.. ప్రధాని మోడీని, ఈసీని టార్గెట్ చేస్తూ ఆరోపణలతో ముందుకు దూసుకెళ్తున్నారు.
ఈసందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే అత్యంత సమర్థుడని తాజా సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది ప్రజలు రాహుల్ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్షాలను సమర్థంగా నడిపించగల నేత ఎవరనే ప్రశ్నకు, సర్వేలో పాల్గొన్న వారిలో 28.2 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు.
ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ 7.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7 శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (6.4శాతం), కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (4.4 శాతం) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే రాహుల్ గాంధీ ఆదరణ పెరగడం గమనార్హం. అప్పుడు ఆయనకు 23.9 శాతం మద్దతు లభించగా, ఇప్పుడు అది 28.2 శాతానికి చేరింది. అయితే, గత ఏడాది ఆగస్టులో వచ్చిన 32.3 శాతంతో పోలిస్తే ఇది కొంత తక్కువే.
లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన పనితీరు ‘అద్భుతంగా’ ఉందని చెప్పిన వారి సంఖ్య ఫిబ్రవరిలో 25 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ఆయన పనితీరు ‘బాగాలేదు’ (పూర్) అని చెప్పిన వారి సంఖ్య 27 శాతం నుంచి 15 శాతానికి గణనీయంగా తగ్గింది. మరో 22 శాతం మంది ‘బాగుంది’ అని, 16 శాతం మంది ‘సాధారణం’ అని అభిప్రాయపడ్డారు.