J.D. Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ

భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరునేతలు ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో పురోగతిని సమీక్షించారు. వాణిజ్యం, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు తదితర అంశాలపై చర్చించారు. రెండు దేవాల ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తూ, పరస్పర ప్రయోజనకరమైన భారత్-అమెరికా(America) ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లో పురోగతిని ఇరు నేతలు స్వాగతించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వాన్స్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ ఫిబ్రవరిలో చేపట్టిన తన అమెరికా పర్యటనను గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో సానుకూల చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆయన భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చర్చల అనంతరం వాన్స్ కుటుంబానికి, అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ బారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో పాటు ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధులు ఉన్నారు.