Nambala Kesava Rao: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతం..! అమిత్ షా ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని (Chattisgarh) నారాయణపూర్ జిల్లాలో (Narayanapur District) బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు (67) (Nambala Kesava Rao) అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు మరణించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ (Operation Black Forest) లో 54 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, 84 మంది లొంగిపోయారని అమిత్ షా తన ట్వీట్‌లో తెలిపారు. మావోయిస్టులపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేతను దళాలు హతమార్చడం ఇదే మొదటిసారి అని… 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతమొందిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు.
1955లో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) జియన్నపేటలో జన్మించిన నంబాల కేశవరావు, వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (REC)లో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ (Peoples War) సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమంలో (Naxalite Movement) చురుకుగా పాల్గొన్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నంబాల, 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ (LTTE) మాజీ సైనికుల వద్ద గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాలపై శిక్షణ పొందారు. 2004లో పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన సీపీఐ (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో గణపతి రాజీనామా తర్వాత ఆయన మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
నంబాల కేశవరావు 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి, 2019లో గడ్చిరోలిలో 15 మంది పోలీసుల మరణానికి సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. అలాగే 2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Chandrababu) అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో (Alipiri Bomb Blast) కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, ఐఈడీల వినియోగంలో నిపుణుడైన నంబాలపై రూ.1.5 కోట్ల రివార్డు ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో (Operation Kagar) భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ లక్ష్యం 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమని అమిత్ షా పునరుద్ఘాటించారు.
అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ అనుమానాలు వ్యక్తం చేశారు. “మృతుల్లో నంబాళ్ల కేశవరావు లేరని మాకు సమాచారం ఉంది. పోలీసులు కావాలనే మైండ్‌గేమ్ ఆడుతున్నారు,” అని ఆయన ఆరోపించారు. గతంలోనూ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై పౌరహక్కుల సంఘం ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం, దీన్ని ప్రధాని మోదీ నిర్ధారించడంతో నంబాల మృతి చెందాడని నిర్ధారించుకోవచ్చు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.