Delhi: యుద్ద సన్నాహాల్లో కేంద్రం… రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్..

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి ఘోర తప్పిదం చేసినవారికి, కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోడీ(Modi).. ఆదిశగా కీలకచర్యలు చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్రా స్వీయరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనేదానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్‌డ్రిల్ (mock drills) నిర్వహించాలని సూచించింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది.
వైమానిక దాడులు జరిగితే.. ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి? సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్‌డ్రిల్ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. కీలకమైన కర్మాగారాలు, ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించనివ్వకుండా చేయడం; హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై ప్రణాళికల్ని రూపొందించాలని సూచనలు చేసింది. సంక్షిష్ట, సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌరరక్షణ సన్నద్ధత పూర్తిస్థాయిలో ఉండాలని పేర్కొంది. బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని సూచించింది..
హాట్‌లైన్, కమ్యూనికేషన్లు జాగ్రత్త
పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో హోంశాఖ ఈ తరహా సూచనలు చేసింది.పాక్ ప్రతిదాడికి దిగితే ఏం చేయాలనేదానిపై ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది. హాట్‌లైన్, వాయుసేనతో రేడియో కమ్యూనికేషన్లు పనిచేసేలా చూసుకోవాలని, కంట్రోల్ రూంల పనితీరును సమీక్షించుకోవాలని కూడా ఆదేశించడం గమనార్హం. త్రివిధ దళాల ఉన్నతాధికారులు గత రెండ్రోజుల్లో ప్రధానితో భేటీ కాగా తాజాగా రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ ఆయనతో సమావేశమయ్యారు. నీటిసరఫరా పరంగానే కాకుండా ఆర్థికంగానూ పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
సింధు నదీజలాలను నిలిపివేయడంతో మొదలైన చర్యలు ఆ తర్వాత బగలిహార్ జలాశయానికి విస్తరించగా తాజాగా సలాల్ జలాశయం నుంచీ నీరు అందించకూడదని నిర్ణయించింది. పాకిస్థాన్‌కు నిధుల్ని నిలిపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కు కేంద్రం విజ్ఞప్తి చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడి.. ఉగ్రవాదంపై పోరుకు పూర్తి మద్దతు ప్రకటించారు. జపాన్ కూడా ఇదే మాట చెప్పింది. యుద్ధం పరిష్కారం కాదని, సంయమనం పాటించాలని భారత్-పాక్‌లకు ఐక్యరాజ్యసమితి సూచించింది.