Justice Bela M Trivedi: జస్టిస్ బేలా ఎం. త్రివేది అనూహ్య పదవీ విరమణ – వివాదాలు, ఊహాగానాలు..!!

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (Supreme Court Justice) జస్టిస్ బేలా మందాకిని త్రివేది (Justice Bela M Trivedi) పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. గుజరాత్‌కు (Gujarat) చెందిన ఈ మహిళా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చరిత్రలో 11వ మహిళా న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఆమె వచ్చే నెల 9న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే దాదాపు మూడు వారాల ముందే.. మే 16న తన చివరి పని దినాన్ని పూర్తి చేశారు. ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) ఆమెకు సంప్రదాయబద్ధమైన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడానికి నిరాకరించడం వివాదాన్ని మరింత రాజేసింది. తాజాగా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమెకు కీలక పదవి అప్పగించబోతోందనే ఊహాగానాలు రాజకీయ, న్యాయ వర్గాల్లో హోరెత్తుతున్నాయి.
సుప్రీంకోర్టు సంప్రదాయం ప్రకారం, పదవీ విరమణ చేసే న్యాయమూర్తులకు SCBA, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) సంయుక్తంగా చివరి పని దినం రోజున సాయంత్రం 4:30 గంటలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తాయి. అయితే.. జస్టిస్ త్రివేది విషయంలో ఈ సంప్రదాయం పాటించలేదు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇందుకు నిరాకరించింది. దీనిపై SCBA స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. అయితే ఆమె ఇచ్చిన కొన్ని తీర్పులు న్యాయవాదుల మధ్య వివాదాస్పదంగా మారాయని చెబుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రధాన న్యాయమూర్తి (CJI) బీ.ఆర్. గవాయ్ (Justice B R Gawai) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇటువంటి సందర్భాలలో అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. నేను ఈ చర్యను బహిరంగంగా ఖండిస్తున్నాను,” అని ఆయన అన్నారు. అయినా SCBA అధ్యక్షుడు కపిల్ సిబల్ (Kapil Sibal), ఉపాధ్యక్షురాలు రచన శ్రీవాస్తవ (Rachana Srivastava) సెరిమోనియల్ బెంచ్‌లో పాల్గొన్నారు.
జస్టిస్ బేలా త్రివేది 1987లో గుజరాత్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2004లో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. ఆమె మూడున్నర సంవత్సరాల కాలంలో అనేక కీలక తీర్పులు ఇచ్చారు. బిల్కిస్ బానో కేసులో దోషుల బెయిల్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు సమర్థన, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారాల సమర్థన వంటి తీర్పులు ఆమెను వెలుగులోకి తెచ్చాయి. అయితే.. కొన్ని తీర్పులు, ముఖ్యంగా నకిలీ వకాలత్‌నామా కేసులో లాయర్లపై కఠిన వైఖరి, న్యాయవాదుల మధ్య అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు.
జస్టిస్ త్రివేది అనూహ్య పదవీ విరమణ వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు, నీతి ఆయోగ్ వంటి బాధ్యతలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. జస్టిస్ త్రివేది గుజరాత్ నేపథ్యం, ఆమె తీర్పుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనవి ఉండటం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.