Pawan Kalyan: టీవీకే తో జనసేన.. తమిళనాడు లో ఇది పాజిబులేనా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికారంలో భాగస్వామ్యం సాధించిన జనసేన (Janasena) పార్టీ ఇప్పుడు తమ ప్రభావాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో ఉందనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu)పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చూపిస్తున్న ఆసక్తి దీనికి కారణమైంది. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన “సేనతో సేనాని” సభ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ తమిళ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) స్థాపించిన తమిళ వెట్రి కగళం (TVK) పార్టీ కండువా ధరించి, ఆ పార్టీ జెండాను చేత పట్టుకొని నినాదాలు ఇచ్చారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ అడుగుపెట్టబోతున్నారని చర్చలు మరింత ఊపందుకున్నాయి.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే విజయ్ పార్టీ బలమైన వాతావరణం సృష్టించుకుంటోంది. ఇటీవల మధురై (Madurai)లో నిర్వహించిన ప్రజాసభకు విపరీతమైన జనసంచారం రావడం పార్టీకి ఊతమిచ్చింది. ఎన్నికల నాటికి ప్రజలు అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రధాన పార్టీలైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK), బీజేపీ (BJP)లతో పొత్తులు పెట్టుకోబోమని ఆయన బహిరంగంగానే చెప్పారు. అయితే, ప్రజల కోసం కృషి చేసే ఇతర పార్టీలతో కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, విజయ్ సీఎం ఎం.కె. స్టాలిన్ (M. K. Stalin)ను “అంకుల్” అని సంబోధించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు విజయ్ పార్టీపై విమర్శలు కూడా లేకపోలేదు. ఆయన పార్టీ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమాలతో బిజీగా ఉండే విజయ్ రాజకీయాలపై నిజంగా ఎంత ఫోకస్ పెట్టగలరన్న అనుమానాలు కూడా ప్రతిపక్ష నేతల నుండి వస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, డీఎంకేకు వ్యతిరేక ఓటు బ్యాంకును విభజించడం ద్వారా బీజేపీకి లాభం చేకూర్చడమే టీవీకే వ్యూహమని అంటున్నారు. ఇలాంటి సమయానికే పవన్ కళ్యాణ్ తన పార్టీని జాతీయస్థాయిలో విస్తరించాలన్న సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా టీవీకే కండువా ధరించడం, జెండా పట్టుకోవడం వంటి చర్యలు ఆయన తమిళనాడు ప్రవేశానికి గట్టి ఆధారంగా చెప్పబడుతున్నాయి.
మెగా అభిమానులు తమిళనాడులో ఉండటం, గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన సభలకు మంచి స్పందన రావడం కూడా ఆయన అడుగుపెట్టే అవకాశాలను బలపరుస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా పోటీ చేస్తారా? లేక దళపతి విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా, పవన్ తమిళ రాజకీయాల్లో ప్రవేశిస్తే అక్కడి సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.