Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా.. పుణ్యక్షేత్రం పూరీకి ఎందుకెళ్లింది..?

హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి(Priyanka senapati) ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ విషయాన్ని పూరీ పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, 2024 సెప్టెంబర్ 26వ తేదీన పూరీ వచ్చిన జ్యోతి మల్హోత్రా.. ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి.. పాకిస్తాన్ కు ఏమైనా సమాచారం అందించిందా అనే దానిపై అనేక అుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్ కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. పాక్ పర్యటనపై సోషల్ మీడియా వేదిక నుంచి ప్రియాంక వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిణి అని నాకు తెలియదు.. పూరీ వచ్చిన ఆమెను ఫ్రెండ్ గానే భావించి.. కలిసి తిరిగాను.. నేను పాక్ కు విహారయాత్ర కోసం మాత్రమే వెళ్లాను.. అంతకుమించి ఏం లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించింది. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేం.. విచారణ కొలిక్కి వచ్చే వరకు ప్రియాంక పూరీ విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను ఒడిశా పోలీసులు శోధిస్తున్నారు.