Sharmishta Panoli: సోషల్ మీడియాలో పోస్టులు.. శర్మిష్ట పనోలీ అరెస్ట్.. ఇంతకూ ఎవరీమె..?

ఆపరేషన్ సిందూర్’ (Operation sindoor) సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వీడియోను పోస్టు చేశారన్న ఆరోపణలపై జైలు పాలైంది 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీ(Sharmistha Panoli). మే 14న ఆమె పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదస్పదం కావడంతో కోల్‌కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. శనివారం ఆమెను కోల్‌కతాలోని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు.
ఎవరీ శర్మిష్ఠ?
కోల్‌కతాలోని ఆనందపుర్ ప్రాంతానికి చెందిన శర్మిష్ఠ పనోలీ.. పుణెలో న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం విద్యార్థిని. లింక్డిన్ ప్రొఫెల్ ప్రకారం.. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 94వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జోడించి తన అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా పాపులర్‌గా మారి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది.
ఏం మాట్లాడింది?
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పోస్టులు, రీల్స్‌ను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే, శర్మిష్ఠను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసులు ఏం చెప్పారు?
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పోస్టు ద్వారా శర్మిష్ఠపై పలు సెక్షన్ల కింద కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శర్మిష్ఠకు, ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికి వెళ్లిపోయారంటూ కోర్టుకు తెలిపారు. దీంతో కోల్‌కతా న్యాయస్థానం శర్మిష్ఠకు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆమె గురుగ్రామ్‌లో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు.. శుక్రవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే, పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున కస్టడీ అవసరం లేదని శర్మిష్ఠ తరఫు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, కోల్‌కతా పోలీసులు తాము సరైన ప్రక్రియనే అనుసరించామని, కోర్టు వారెంటు ఆధారంగానే చట్టబద్ధంగానే ఆమెను అరెస్టు చేశామని సమర్థించుకున్నారు.