గూగుల్‌కు ఎదురుదెబ్బ.. వారంలోగా పదిశాతం డిపాజిట్
ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట దక్కలేదు. గూగుల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనసాగించిన దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్ల లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు (స్టే ఇచ్చేందుకు) నిరాకరించిన సుప్రీం కోర్టు.. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గరే తేల్చుకోవాలని గూగుల్‌కు సూచించింది. మరోవైపు గూగుల్ దాఖలు చేసిన అప్పీల్‌పై మార్చి 31వ తేదీలోగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీ ని ఆదేశిచింది సుప్రీంకోర్టు. అంతేకాదు సీసీఐ విధించిన జరిమానాలో పది శాతాన్ని వారంరోజుల్లోగా డిపాజిట్ చేయాలని గూగుల్‌కు స్పష్టం చేసింది. భారత్‌లో గూగుల్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌కు పాల్పడుతోందని, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని గుర్తించిన సీసీఐ.. గూగుల్‌కు రూ.1,337 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది గూగుల్. అయితే సీసీఐ ఆదేశాలపై ఇంటీరియమ్ స్టేకు ఎన్సీఎల్ఏటీ కూడా నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించింది గూగుల్.






