1,337.76 కోట్లు ఫైన్ చెల్లించిన గూగుల్.. ఎందుకో తెలుసా?
ఆండ్రాయిడ్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానా మొత్తం 1,337.76 కోట్ల రూపాయలను గూగుల్ చెల్లించింది. గత సంవత్సరం అక్టోబర్ 20న సీసీఐ ఈ రూలింగ్ ఇచ్చింది. ఈ జరిమానాను 30 రోజుల్లోగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు జమ చేయాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. మార్చి 29న ఎన్సీఎల్ఏటీ గూగుల్‌పై సీసీఐ విధించిన జరిమానాను ధృవీకరించింది. ఎన్సీఎల్ఏటీ చైర్మన్ అశోక్ భూషణ్‌తో పాటు అలోక్ శ్రీవాస్తవా సభ్యులుగా ఉన్న బ్రెంచ్ దీనిపై 189 పేజీల ఆదేశాలను జారీ చేసింది. తీర్పు ఇచ్చిన 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించింది. జరిమానాతో పాటు సీసీఐ గూగుల్ పై విధించిన 10 షరతుల్లో నాలుగింటిని ఎన్సీఎల్ఏ టీ ఆర్డర్ ప్రక్కన పెట్టింది.
గూగుల్ ఈ మేరకు కొంత ఊరట లభించింది. ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిన వాటిలో ప్రీ లోడెడ్ యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులను అనుమతించడం, సైడ్‌లోడెడ్ యాప్‌లను అనుమతించడం, ప్లే స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించడం వంటి వాటికి సంబంధించి నాలుగు షరతులను పక్కన పెట్టింది. మిగిలిన 6 నాన్`మానిటరీ డైరెక్షన్స్ ను గూగుల్ 30 రోజుల్లోగా అమలు చేయాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. దీనిపై గూగుల్ కోర్టులో అపీల్ చేస్తుందా, ఆదేశాలను అమలు చేస్తుందా అన్న విషయం తెలియరాలేదు.






