Ground Mines: భారత నావికాదళం పొదిలో మరో భీకర అస్త్రం..

భారత నౌకాదళం మరింత శత్రుభీకరంగా రూపుదిద్దుకోనుంది. జలమార్గంలో శత్రువుల కుట్రల్ని దీటుగా తిప్పికొట్టేలా డీఆర్డీవో-నేవీ సంయుక్తంగా అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేశాయి. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్‌ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ (MIGM) పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత నావికాదళం మరింత శక్తిమంతం కానుంది. ఈ వ్యవస్థ భారత నావికాదళం సముద్ర గర్భంలో పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచనుంది.
అధునాతన సముద్రగర్భ నావల్ మైన్‌ను విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబోరేటరీ.. భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) లేబోరేటరీలు, పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి లేబోరేటరీ, చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చి లేబోరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు. శత్రు నౌకలు, జలంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికా దళం సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనికి విశాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్షతో ఈ వ్యవస్థ ఇప్పుడు భారత నేవీ దళంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు.
మల్టీ-ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ అంటే ఏమిటి?
భారత నావికాదళం ఇప్పటివరకు వివిధ రకాల గ్రౌండ్ మైన్స్ వినియోగిస్తోంది. కానీ ఇప్పుడు ఒకే మైన్స్ లో అన్ని రకాల క్వాలిటీస్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఉదాహరణకు ఇది 3 రకాల సెన్సార్ ఇన్‌పుట్ టెక్నాలజీలపై పనిచేస్తుంది. ఇది అయస్కాంత, ధ్వని పీడనం ప్రకారం పనిచేస్తుంది. ఆ క్షేత్రం దగ్గర ఓడ లేదా జలాంతర్గామి వెళితే వెంటనే అక్కడి వాటర్ ప్రెజర్ మారుతుంది లేదా పెరుగుతుంది. సెన్సార్లు ఈ మార్పును , బ్లాస్ట్స్ ను వెంటనే గుర్తిస్తాయి. రెండోది మాగ్నటిక్ ఎఫెక్ట్.. ఇది నీటి లోపల మెటల్ బాడీస్ కదలికను గుర్తిస్తుంది. మూడోది ధ్వని ప్రభావం, అంటే దీని సెన్సార్లు నీటి అడుగున వెళ్లే మెరైన్స్, జలాంతర్గాముల కంపనాలను సంగ్రహించి ట్రాక్ చేస్తాయి. ఫలితంగా నీటి అడుగు నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా భారత్ ఎదుర్కొనే సత్తా సాధించుకుంది.