Modi: ఆపరేషన్ సుదర్శన్ చక్రం… భారత గగనతం శతుృ దుర్భేధ్యం..

రాకెట్ ఫోర్స్ తో ఢిల్లీకి హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ కు.. అదేరీతిలో బుల్లెట్ లా కౌంటరిచ్చింది మోడీ (Modi) సర్కార్. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం పేరును దీనికి ఖరారు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భారత గగనతల రక్షణ వ్యవస్థ పాటవాన్ని ప్రత్యక్షంగా చూసిన పాక్‌కు .. ఇది మరింత ఆందోళనకరమని చెప్పవచ్చు.
యుద్ధ సమయంలో శత్రువు.. విద్యుత్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, ఆహార, నీటి సరఫరా, వైద్య పరిరక్షణ, రైల్వేస్టేషన్లు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగే అవకాశం ఉంది. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్.. పాక్‌లోని ముష్కర ముఠాల స్థావరాలు, వైమానిక శిబిరాలపై దాడి చేసింది. దీనికి ప్రతిగా పొరుగు దేశం.. స్వల్పశ్రేణి ఫతా-1, ఫతా-2 క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను భారత్‌పైకి భారీగా ప్రయోగించింది. వీటిని మన గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. అలాగే ఇరాన్‌తో జరిగిన పోరులో ఇజ్రాయెల్‌ను ఈ క్షిపణి రక్షణ కవచమే రక్షించింది.
భారత వద్ద ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్) ఉంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ దాడులను తిప్పికొట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్, రియల్‌టైమ్ గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ. ఇందులో వివిధ సెన్సర్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు. ఇది భారత గగనతలంపై నిరంతరంగా నిఘా వేస్తూ.. ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. భూతల, గగనతల, నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అభివృద్ధి చేసింది. అత్యంత వేగవంతమైన వైమానిక దళ నెట్‌వర్క్‌పై ఇది పనిచేస్తుంది. తద్వారా వివిధ సెన్సర్లు, యుద్ధవిమానాలు, ఆకాశ్, బరాక్-8, ఎంఆర్ శామ్, ఎస్-400 వంటి క్షిపణి వ్యవస్థలకు సైనికాధికారులకు మధ్య డేటా బట్వాడా వేగంగా సాగుతుంది. ఇది ఆకాశ్ తీర్ అనే మరో వ్యవస్థ, డ్రోన్లపై కన్నేసే ఇంటిగ్రేటెడ్ కౌంటర్-యూఏఎస్ గ్రిడ్‌తో అనుసంధానమైంది. ఈ నెట్‌వర్క్ ఆధారిత విధానం వల్ల శత్రు డ్రోన్లు, విమానాలు, క్షిపణులను ఎప్పటికప్పుడు గమనించడానికి, సకాలంలో ప్రతిచర్యలు చేపట్టడానికి, ప్రాధాన్య క్రమంలో.. ఎప్పుడు ఏ ఆయుధాన్ని వాడాలో నిర్ణయించుకోవడానికి వీలు కలిగింది.
సుదర్శన్ చక్రలో భాగంగా ఐఏసీసీఎస్‌ను మరింత బలోపేతం చేసి.. దానికి ప్రతిదాడి సామర్థ్యాన్ని జోడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. శత్రువుపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల దీర్ఘశ్రేణి క్షిపణులను దీనికి అనుసంధానిస్తారని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఆత్మరక్షణతోపాటు ఎదురుదాడికి వీలు కల్పించే ఒక శక్తిమంతమైన నెట్‌వర్క్ సిద్ధమవుతుంది. ఇది ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఐరన్ డోమ్’ వ్యవస్థ కన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.
2035 నాటికి సుదర్శన్ చక్ర సిద్ధమవుతుంది. ఇది దేశంలోని వ్యూహాత్మక, పౌర మౌలికవసతులను శత్రు గగనతల దాడుల నుంచి రక్షిస్తుంది. ఈ కవచాన్ని విస్తరిస్తూ పోతామని, పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చూస్తామని మోడీ తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించినా.. మన సాంకేతికత ముందు అది దిగదుడుపు అవుతుందన్నారు. సైబర్ యుద్ధాన్ని తిప్పికొట్టే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థలో ఉంటుందని చెబుతున్నారు. సుదర్శన్ చక్ర ప్రాజెక్టును స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత్ చేపడుతుంది.