OMC Case: ఓబుళాపురం మైనింగ్ కేసు: గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష

ఓబుళాపురం మైనింగ్ కేసులో (OMC Case) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు (CBI Court) సంచలన తీర్పును వెలువరించింది. కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan reddy) , బి.వి. శ్రీనివాస రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వి.డి. రాజగోపాల్, కె. మెఫజ్ అలీ ఖాన్‌లను దోషులుగా తేల్చింది. వీళ్లకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC)ని కూడా దోషిగా నిర్ధారణ అయింది. అయితే, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy), మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. భారతదేశంలోని అతిపెద్ద అక్రమ మైనింగ్ కుంభకోణాల్లో ఒకటిగా ఈ కేసు పేరుగాంచింది. 13 ఏళ్ల తర్వాత కేసు తీర్పు రావడంతో దీనికి ముగింపు పలికినట్లయింది.
ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram Mining Case) 2007లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓఎంసీకి 95 హెక్టార్లలో ఇనుప ఖనిజ గనుల లీజు కేటాయింపుతో ప్రారంభమైంది. ఈ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి, బి.వి. శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నడిచింది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలో ఈ లీజు కేటాయింపులు జరిగాయి. ఇవి రాజకీయ ప్రేరేపితమని ఆరోపణలు వచ్చాయి. 2009లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ కేసును చేపట్టింది. ఓఎంసీ అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తవ్వి, కర్ణాటకలోని అటవీ భూములతో సహా లీజు సరిహద్దులను ఉల్లంఘించిందని ఆరోపించింది.
సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం, ఓఎంసీ 60 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ. 884.13 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ అక్రమాలకు సహకరించిన వారిలో అప్పటి ఇండస్ట్రీస్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, వి.డి.రాజగోపాల్, ఇతర అధికారులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక లోకాయుక్త నివేదిక ప్రకారం, 2006-2011 మధ్య రూ. 12,000 కోట్ల విలువైన ఇనుప ఖనిజం అక్రమంగా ఎగుమతి చేయబడింది., ఇందులో గాలి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
సీబీఐ 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్ రెడ్డి, బి.వి. శ్రీనివాస రెడ్డి, వి.డి. రాజగోపాల్‌ను అరెస్టు చేసింది. తరువాత వై. శ్రీలక్ష్మితో పాటు ఇతరులను కూడా అరెస్టు చేశారు. 2011 డిసెంబర్‌లో సీబీఐ 186 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది, ఇందులో నిందితులపై ఐపీసీ సెక్షన్‌లు 120బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (ప్రభుత్వ నమ్మక ద్రోహం), 468 & 471 (ఫోర్జరీ), అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌లు 13(2) & 13(1)(d) కింద ఆరోపణలు ఉన్నాయి. విచారణలో 219 సాక్షులను విచారించి 3,337 డాక్యుమెంట్‌లను పరిశీలించారు.
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ విచారణకు 2025 మే నాటికి గడువు విధించింది. విచారణ సమయంలో, వై. శ్రీలక్ష్మి 2022లో తెలంగాణ హైకోర్టు ద్వారా ఆరోపణల నుంచి విముక్తి పొందారు. ఆమెపై సీబీఐ ఆధారాలు సరిపోవని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇతర నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి, బి.వి. శ్రీనివాస రెడ్డిపై ఆరోపణలు కొనసాగాయి. ఎట్టకేలకు వాళ్లపై ఆరోపణలు నిజం కావడంతో కోర్టు వాళ్లకు శిక్షలు విధించింది. తాను ప్రజాప్రతినిధినని, తాను చేసిన సేవా కార్యక్రమాలు చూసి శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే పదేళ్లు ఎందుకు శిక్ష వేయకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. చేసిన తప్పుకు ఇంతకంటే మించిన శిక్ష విధించేందుకు నీవు అర్హుడివి అని కోర్టు అభప్రాయపడింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి వెనక్కు తగ్గారు. తీర్పు అనంతరం నిందుతులను జైలుకు తరలించారు.