Caste Census: కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తేనె తుట్టెను కదిలిస్తోందా…?

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్త కులగణన (Caste Census) చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది. జనాభా లెక్కలతో పాటు కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం వెనుక బహుముఖ కారణాలు, రాజకీయ ఉద్దేశాలు, సామాజిక అవసరాలు ఉన్నాయి.
కులగణనకు ఆమోదం తెలిపడం వెనుక ప్రధాన కారణం.. సామాజిక న్యాయాన్ని సుస్థిరం చేయడం, వెనుకబడిన కులాల (BC) సామాజిక-ఆర్థిక స్థితిగతులను ఖచ్చితంగా అంచనా వేయడం. 2011 జనాభా లెక్కలలో (2021 census) కుల గణన జరిగినప్పటికీ, ఆ డేటా అధికారికంగా విడుదల కాలేదు. దీంతో వివిధ కులాల జనాభా, వారి ఆర్థిక పరిస్థితులు, ఉపాధి, విద్యా స్థాయిలపై సమగ్ర సమాచారం లేదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది అడ్డంకిగా మారింది. ఇప్పుడు కులగణన చేయాలని నిర్ణయించడం ద్వారా సామాజిక సామరస్యతను బలోపేతం చేయడం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలుకు మార్గం సుగమం అవుతుంది.
కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) వంటి విపక్షాలు ఎంతోకాలంగా కులగణన కోసం ఒత్తిడి చేస్తున్నాయి. కులగణన లేకపోవడం వల్ల వెనుకబడిన కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు (Reservations) పూర్తిస్థాయిలో అందడం లేదనేది ఆ పార్టీల వాదన. రాహుల్ గాంధీ వంటి నాయకులు దేశ సంపదలో వెనుకబడిన కులాలకు తగిన వాటా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టబద్ధత అవసరమని పదేపదే వాదిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కులగణన చేసిన అనుభవం విపక్షాల డిమాండ్‌కు బలం చేకూర్చింది. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుని, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
కులగణన వెనుక రాజకీయ పార్టీలు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీజేపీ సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నట్లు చాటింది. విపక్షాల రాజకీయ ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలని భావిస్తోంది. మరోవైపు, విపక్షాలు కులగణన డేటాను ఉపయోగించి రిజర్వేషన్ కోటాలను పెంచడం, సంక్షేమ పథకాలను విస్తరించడం వంటి వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లింగాయత్, ఒక్కలిగ వంటి ఆధిపత్య కులాలు కులగణన డేటా విడుదలను వ్యతిరేకించడం రాజకీయ సమీకరణాలను మరింత జటిలం చేస్తోంది.
కులగణన అనేక సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన కులాల ఖచ్చితమైన జనాభా, వారి విద్య, ఉపాధి, ఆర్థిక స్థితులపై సమగ్ర డేటాను అందిస్తుంది. దీంతో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలను రూపొందించే అవకాశం లభిస్తుంది. రిజర్వేషన్లను జనాభా నిష్పత్తులకు అనుగుణంగా సవరించేందుకు వీలవుతుంది. కులగణన సామాజిక అసమానతలను తగ్గించడానికి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ, ఆర్థిక గుర్తింపును కల్పించడానికి దోహదపడుతుంది. అయితే, ఈ కులగణన ఎంతవరకూ సక్రమంగా జరుగుతుందనేదానిపై అనేక అనుమానాలున్నాయి.
కులగణన అమలు అంత ఈజీ కాదు. గతంలో బీహార్, కర్ణాటకలో చేపట్టిన కులగణనలు రాజకీయ వివాదాలకు దారితీశాయి. ఆధిపత్య కులాలు తమ ప్రాబల్యం తగ్గుతుందనే భయంతో డేటా విడుదలను వ్యతిరేకించాయి. ఇటువంటి సవాళ్లు జాతీయ స్థాయిలో మరింత తీవ్రంగా ఉండవచ్చు. అయితే పారదర్శకత, సామాజిక సామరస్యతను కాపాడటం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. మరి ఈ విషయంలో కేంద్రం ఎంతమేర సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.