Bengaluru Mishap: అభిమాన ఉన్మాదం ఎక్కడికి పోతోంది?

బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట (stampede) ఒక విషాద ఘటనగా నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 (IPL 2025) టైటిల్‌ను 18 ఏళ్ల తర్వాత సాధించిన సంబరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేడియం వద్ద సుమారు 2-3 లక్షల మంది అభిమానులు సంబరాలకు తరలిరాగా, స్టేడియం సామర్థ్యం కేవలం 35వేలు మాత్రమే. ఈవెంట్ పై అవగాహన లేకపోవడం, ఫ్యాన్స్ ఎంతమంది వస్తారో అంచనా వేయకపోవడం, ఉచిత పాస్‌లపై అయోమయం కారణంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు?
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Sidharamaiah) ప్రభుత్వం కేవలం అనుమతి ఇచ్చి, భద్రత కోసం పోలీసులను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. అయితే, భారీ జనసమూహాన్ని ఊహించలేకపోవడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, ఉచిత టికెట్ల గురించి వచ్చిన అస్పష్టమైన సమాచారం ఈ విషాదానికి కారణాలుగా తెలుస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదిక కోరింది.
ఈ దుర్ఘటన ఐపీఎల్ వంటి కార్పొరేట్ ఆధారిత క్రీడా ఈవెంట్‌లపై, అభిమానుల ఉన్మాదంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఐపీఎల్ ఒక కార్పొరేట్ క్రీడా ఈవెంట్. దీనిని కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం నిర్వహిస్తాయి. ఈ ఈవెంట్‌లకు ప్రభుత్వాలు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఇది రాష్ట్రం కోసమో, దేశం కోసమో అడిన జట్లు కావు. ఇలాంటి వాళ్లకోసం అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూడడానికి ప్రాణాలను పణంగా పెట్టడం, సమయాన్ని వృథా చేయడం సమంజసమా? హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కూడా ఇలాంటి అభిమాన ఉన్మాదాన్ని గుర్తు చేసింది.
ఈ సంఘటనలు సమాజంలోని ప్రాధాన్యతలను ప్రశ్నిస్తున్నాయి. చదువు, కెరీర్, సామాజిక బాధ్యతల వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన యువత, క్రీడలు, సినిమాల వంటి వినోద రంగాలపై అతిగా ఆకర్షితులవుతున్నారు. ఈ ఉన్మాదం వెనుక కార్పొరేట్ సంస్థలు అభిమానుల భావోద్వేగాలను ఆదాయ వనరుగా మల్చుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అభిమానం ఒక సానుకూల భావన అయినప్పటికీ, అది ఉన్మాదంగా మారినప్పుడు ప్రమాదకరంగా తయారవుతుంది. యువత తమ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలు, నిర్వాహకులు కూడా వీక్షకుల భద్రతను ప్రథమ ప్రాధాన్యతగా భావించాలి. ఈ విషాదం ఒక గుణపాఠంగా నిలిచి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.