అవని మల్హోత్రాకు జాక్ పాట్ .. మైక్రోసాఫ్ట్ లో
ఐఐఎం సంబల్పూర్ విద్యార్థులు ప్లేస్మెంట్లు, వేతనాల విషయంలో సరికొత్త రికార్డ్ సాధించారు. 2021-23 ఏడాదికి గాను 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది. ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా వీరిలో 80 మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్ ప్లేస్ కొట్టేసింది. జైపూర్‌కు చెందిన అవని మల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో (రూ.64.61 లక్షలు) వార్షిక జీతాన్ని అందుకోనుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్ చదవడం ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను చేధించడంలో సాయం చేసిన ప్రొఫెసర్లకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్మెంట్ సాధించారని ఐఐఎం సంబల్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు.






