Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు..!! విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..!!

హర్యానాకు (Haryana) చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్, ‘ట్రావెల్ విత్ జో’ (Tavel with Jo) యూట్యూబ్ చానెల్ యజమాని జ్యోతి మల్హోత్రా (33)ను (Jyoti Malhotra) భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. దేశ రహస్యాలను పాకిస్తాన్‌కు (Pakistan) చేరవేసిన ఆరోపణలపై ఆమె అరెస్టు అయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని హిసార్‌కు చెందిన 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతోంది. ఆమెకు 3.77 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనను తాను ‘నోమాడిక్ లియో గర్ల్’, ‘వాండరర్ హర్యాన్వీ+పంజాబీ’, ‘పురానే ఖయాలో కీ మోడర్న్ లడకీ’గా ఆమె చెప్పుకుంటూ ఉంటుంది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, భూటాన్, ఇండోనేషియా, చైనా వంటి దేశాల్లో పర్యటించిన వీడియోలను ఆమె షేర్ చేసింది. అయితే, 2023లో ఆమె చేసిన పాకిస్తాన్ పర్యటనలు, పాక్ హైకమిషన్ అధికారులతో సంబంధాలు ఆమెపై అనుమానాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో హిసార్‌లోని న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్‌లో ఆమెను రెండ్రోజుల కిందట NIA అరెస్టు చేసింది.
జ్యోతి మల్హోత్రాపై ప్రధానంగా భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె 2023లో పాకిస్తాన్ హైకమిషన్‌లో వీసా కోసం వెళ్లినప్పుడు ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని కలిసింది. గూఢచర్యం కారణంగా ఈ నెల 13న ఈ డానిష్ ను భారత ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. డానిష్ ద్వారా జ్యోతి, అలీ అహ్వాన్, షాకిర్, రాణా షహబాజ్ వంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులను జ్యోతి కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె షాకిర్ నంబర్‌ను ‘జట్ రంధావా’ అనే ఫేక్ పేరుతో సేవ్ చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆమె సమాచారాన్ని పంపినట్లు తెలిసింది.
జ్యోతి 2023లో రెండుసార్లు, కొన్ని రిపోర్టుల ప్రకారం నాలుగుసార్లు పాకిస్తాన్‌ను సందర్శించింది. ఈ సందర్శనల్లో ఆమె పాకిస్తాన్‌ను సానుకూలంగా చిత్రీకరిస్తూ వీడియోలు పోస్టు చేసింది. లాహోర్‌లోని అనార్కలీ బజార్, కటాస్ రాజ్ ఆలయం, బస్సు ప్రయాణాలు వంటి వీడియోలు ఆమె ఛానెల్‌లో ఉన్నాయి. ఈ వీడియోలు పాకిస్తాన్ గురించి సానుకూల దృక్పథాన్ని కలిగించేందుకు ISI ఆదేశాల మేరకు తయారు చేసిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అంతేకాక.. ఆమె ఒక పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్టు సమాచారం. అతనితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
జ్యోతి మల్హోత్రా స్వయంగా పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె అరెస్టుకు కీలక ఆధారంగా మారింది. 2024 మార్చి 28న పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ డిన్నర్‌కు ఆమె హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె డానిష్‌తో సన్నిహితంగా మాట్లాడటం, అతని భార్యతో సంభాషించడం, పాకిస్తాన్ హాస్పిటాలిటీని పొగడటం కనిపించింది. ఆమె ఈ ఈవెంట్‌లో పాకిస్తాన్ వీసా కోసం అధికారులను కోరడం, ఇతర యూట్యూబర్లతో కలిసి పాకిస్తాన్ సందర్శన గురించి చర్చించడం రికార్డైంది. ఈ వీడియో ఆమె పాక్ అధికారులతో సంబంధాలను స్పష్టం చేసింది.
దర్యాప్తు సంస్థలు ఆమె మొబైల్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నాయి. ఆమె బ్యాంకు లావాదేవీలు, పాకిస్తాన్ పర్యటనల స్పాన్సర్‌షిప్‌లపై కూడా దృష్టి సారించాయి. 2024 మేలో ఒక ఎక్స్ యూజర్ కపిల్ జైన్, జ్యోతి కార్యకలాపాలపై NIAకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జ్యోతి మల్హోత్రాపై ఆఫీషియల్ సీక్రెట్స్ ఆక్ట్, 1923లోని సెక్షన్లు 3, 4, 5.., భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చట్టాలు గూఢచర్యం, విదేశీ ఏజెంట్లతో సమాచార బదిలీ, రహస్య సమాచారాన్ని లీక్ చేయడం వంటి నేరాలను కవర్ చేస్తాయి. ఈ ఆరోపణలు నిరూపితమైతే, మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.