Turkey: పుతిన్, జెలెన్ స్కీ ప్రత్యక్ష చర్చలపై సర్వత్రా ఆసక్తి..

యుద్ధం ముగింపుపై ప్రత్యక్ష చర్చల కోసం సిద్ధమేనని రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్ (Vladimir Putin), జెలెన్‌స్కీలు ఇప్పటికే ప్రకటించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా గురువారం ఇరుదేశాల చర్చలకు పుతిన్ ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) మాట్లాడుతూ.. ఆ రోజు తాను తుర్కియేలోనే రష్యా అధినేత కోసం వేచి ఉంటానని తెలిపారు. ఒకవేళ చర్చలకు రాకపోతే మాత్రం ఆయన యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతుందన్నారు.
‘‘తుర్కియే రాజధాని అంకారాలో గురువారం ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశమవుతాను. ప్రత్యక్ష చర్చలకు పుతిన్ రాక కోసం ఇద్దరం ఎదురుచూస్తాం. ఒకవేళ ఆయన ఇస్తాంబుల్‌కు వస్తే.. మేం కూడా అక్కడికి పయనమవుతాం. చర్చలకు రాకుండా ఆటలాడితే మాత్రం.. యుద్ధం ముగించాలన్న ఉద్దేశం ఆయనకు లేదన్నది స్పష్టమవుతుంది’’ అని కీవ్‌లో జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. పుతిన్ చర్చలకు హాజరు కాకపోతే.. మాస్కోపై మరిన్ని ఆంక్షలకు అమెరికా, యూరోపియన్ దేశాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. చర్చలకు హాజరవుతారో లేదో పుతిన్ ఇంకా వెల్లడించలేదు. క్రెమ్లిన్ సైతం ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేదు. తమ అధ్యక్షుడు అవసరమని భావిస్తే దీనిపై ప్రకటన చేస్తామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రాత్రిపూట దాడులకు రష్యా కేవలం 10 డ్రోన్లే ప్రయోగించింది. ఈ ఏడాదిలో మాస్కో చేపట్టిన డ్రోన్ల దాడుల్లో ఇదే అతి చిన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఇరుదేశాల మధ్య శాంతిచర్చలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.